కరోనా కష్టకాలం; వీరి బతుకులు ఆగమాగం

31 Jul, 2021 19:53 IST|Sakshi

పని చేసినా వేతనాలు అరకొరే

ఇప్పటికే సగం మందికి ఉద్వాసన

ఆర్థిక కష్టాల్లో ప్రైవేట్‌ టీచర్లు  

హైదరాబాద్‌ నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన ఖైసర్‌ ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో అయిదేళ్లుగా సైన్స్‌ టీచర్‌గా పని చేస్తున్నాడు. నెలసరి వేతనం రూ.16 వేలు. ప్రైవేట్‌గా హోం ట్యూషన్లతో మరో రూ.5వేల వరకు సమకూరేది. కుటుంబం నెలసరి ఖర్చులకు అతికష్టంగానే సరిపోయేది. కరోనా నేపథ్యంలో గత విద్యా సంవత్సరం స్కూల్స్‌ మూత పడి విద్యా బోధన ఆన్‌లైన్‌కు పరిమితమైంది. దీంతో ఫీజులు వసూలు కావడం లేదంటూ స్కూల్‌ యాజమాన్యం కొందరికి ఉద్వాసన పలికింది. మరికొందరి టీచర్ల వేతనంలో 25 శాతం కోత విధించింది.

ఉద్యోగం నుంచి తొలగింపునకు గురికాలేదన్న సంతోషం మిగిలినా.. అదనపు ఆదాయం సమకూరే  హోం ట్యూషన్లకు అవకాశం కూడా లేక ఆర్థిక పరిస్ధితులు భారంగా తయారయ్యాయి. అయినా కేవలం రూ.12 వేలతో కుటుంబ పోషణ కష్టంగా తయారైనా బతుకు బండిలాగక తప్పలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనా తిరిగి విద్యా బోధన ఆన్‌లైన్‌కే పరిమితమైంది. పాఠశాల యాజమాన్యం ఫీజులు వసూలు కావడం లేదంటూ ఉపాధ్యాయుల వేతనాలకు కోత పెట్టింది. దీంతో నెలసరి వేతనం రూ.8 వేలకు పరిమితమైంది. కుటుంబ అవసరాలకు కష్టంగా మారింది. ఇది ఒక ఖైసర్‌ ఆర్థిక సమస్య కాదు.. మహానగరంలోని వేలాది మంది ప్రైవేటు టీచర్లది ఇదే దుస్థితి.  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కష్టకాలంలో ప్రైవేట్‌ టీచర్ల బతుకులు ఆర్థికంగా ఛిద్రమయ్యాయి.  గడ్డు పరిస్థితులకు తాళలేక కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడడం విషాదకరం. ప్రాంణాంతక వైరస్‌ గత విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్‌ టీచర్లు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. నెలవారీ ఖర్చులు తగ్గించుకున్నా పూట గడవని పరిస్థితి నెలకొంది. ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డునపడ్డారు. బతుకు బండి లాగడానికి  కొందరు కూరగాయలు, పండ్లు అమ్మకాలకు కూడా కొనసాగిస్తున్నారు. చిల్లర వర్తకులుగా మారి ఇంటిని గట్టెక్కిస్తే చాలు అంటూ జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగాల్లో కొనసాగుతున్న టీచర్ల పరిస్థితి  చాలీచాలని వేతనాలతో దయనీయంగా తయారైంది. కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితికి చేరింది. బడ్జెట్‌ స్కూల్స్‌తో పాటు కార్పొరేట్‌ స్కూల్స్‌ టీచర్లు కూడా ఆర్థిక కష్టాలకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌లో బోధిస్తున్నవారి జీతాలు సగం మేర కత్తెర పడ్డాయి. 

వస్తువులు తాకట్టు పెట్టి.. 
కొన్ని స్కూళ్లు పలువురి ఉపాధ్యాయులకు ఉద్వాసన పలికితే.. మరికొన్ని వేతనాల్లో కోత పెట్టాయి. దీంతో కుటుంబం నడిచే పరిస్థితి లేకపోవడంతో కొందరు నగలు నట్రా తాకట్టు పెట్టారు. మహా నగరంలోని సుమారు 72 శాతం మంది టీచర్లు... తమ విలువైన నగలు, వస్తువులు తాకట్టు పెట్టడమే కాకుండా బంధువుల నుంచి అప్పులు చేసినట్లు  ఓ ఎన్జీఓ సంస్ధ సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. సుమారు 83 శాతం మంది టీచర్లు... అయిదు నెలల ఇంటి అద్దెలు బకాయి పడ్డారు. కరోనా వాళ్ల జీవితాలపై ఎంత పెను ప్రభావం చూపిందో స్పష్టమవుతోంది. 

రెండు నెలలకు పరిమితం.. 
ప్రైవేటు టీచర్లకు సర్కార్‌ ఆర్థిక సాయం కేవలం రెండు నెలలకు పరిమితమైంది. గుర్తింపు పొందిన ప్రైవేట్‌ విద్యాసంస్థల టీచర్లు, ఇతర సిబ్బందికి  2వేల రూపాయల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి  25 కేజీల బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా సరఫరా చేసి చేతులు దులుపుకొంది.  అది కూడా సగానికి పైగా టీర్లకు అందలేదన ఆరోపణలు లేకపోలేదు.  

మరిన్ని వార్తలు