పిల్లలకు థర్డ్‌వేవ్‌ అలర్ట్‌.. ముప్పును ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు!

1 Jun, 2021 11:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 నిలోఫర్‌లో మరో వెయ్యి పడకలు

పిల్లలకు చికిత్స అందించేందుకు వీలు

ఇప్పటికే మహారాష్ట్రలో కేసులతో

వైద్యారోగ్య శాఖ అప్రమత్తం

చర్యలకు ఉపక్రమించిన అధికారులు

సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటివరకు పిల్లలకు కోవిడ్‌ టీకాలు అందుబాటులోకి రాలేదు. వచ్చే వారం నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్‌ నుంచి థర్డ్‌వేవ్‌ ప్రారంభమయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. పిల్లలపై  వైరస్‌ ప్రభావం పడనుందనే వైద్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఈ ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం నిలోçఫర్‌ ఆస్పత్రిలో అదనంగా మరో వెయ్యి పడకలు సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పాత భవనంతో పాటు దీనికి ఎదురుగా ఉన్న ఇన్పోసిస్‌ బిల్డింగ్, నాట్కో ఓపీ బిల్డింగ్‌లపై తాత్కాలికంగా షెడ్లు వేసి అదనపు పడకలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఫస్ట్‌వేవ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది చిన్నారులు వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో ఇద్దరు చనిపోయారు. ప్రస్తుత సెకండ్‌వేవ్‌లో ఇప్పటివరకు 300 మంది వరకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.  

పీడియాట్రిక్‌ కోవిడ్‌ నోడల్‌ సెంటర్‌గా నిలోఫర్‌.. 
► ప్రస్తుతం నిలోఫర్‌ నవజాత శిశువుల ఆర్యోగ కేంద్రంలో వెయ్యి పడకలు ఉన్నారు. ఇక్కడ నిత్యం 1,200 మంది చిన్నారులు ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతుంటారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో ఒక్కో ఇంకుబేషన్‌/ఫొటో థెరపీ/పడకపై ఇద్దరు ముగ్గురు చిన్నారులు చికిత్స పొందుతుంటారు. వీరిలో ఎక్కువగా పుట్టుకతోనే ఉమ్మనీరు మింగిన వారు, నెలలు నిండకముందు తక్కువ బరువుతో జన్మించిన వారు, అవయవలోపంతో జన్మించిన వారు ఉంటారు. 
► ఫస్ట్‌వేవ్‌లో ఇక్కడ ప్రత్యేక పడకలు లేకపోవడంతో కోవిడ్‌ లక్షణాలున్న వారిని వెంటనే గాంధీకి తరలించి చికిత్స చేయించారు. ఆ తర్వాత ఇన్పోసిస్‌ బిల్డింగ్‌లో 150 పడకలతో కోవిడ్‌ వార్డును ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటి వరకు 70 మంది పిల్లలు ఇక్కడ అడ్మిటయ్యారు. వీరిలో ముగ్గురు చనిపోయారు. థర్డ్‌వేవ్‌ ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో నిలోఫర్‌ ఆస్పత్రిని పీడ్రియాట్రిక్‌ కోవిడ్‌ నోడల్‌ సెంటర్‌గా ప్రకటించింది. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న పడకలకు అదనంగా మరో వెయ్యి పడకలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది.  

ఆక్సిజన్‌కు ఢోకా లేదు..  
►  12 పీడియాట్రిక్‌ యూనిట్లు, 3 గైనకాలజీ యూనిట్లు, 4 జనరల్‌ సర్జరీ, 2 నియోనాటాలజీ యూనిట్లు ఉన్నాయి. పాత భవనంలో 6 కేఎల్, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో 10 కేఎల్‌ సామర్థ్యం ఉన్న రెండు ఆక్సిజన్‌ నిల్వ ట్యాంకులు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న పడకలన్నింటికీ ఆక్సిజన్‌ సరఫరా సదుపాయం ఉంది. కొత్తగా ఏర్పాటు చేసే పడకలకు ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ వేయాల్సి ఉంది.  
► ఇప్పటి వరకు రోజుకోసారి నింపిన ఈ ట్యాంక్‌లను భవిష్యత్తులో రోజుకు రెండు మూడు సార్లు నింపాల్సివచ్చినా ఇబ్బంది ఉండదు. వైద్య నిపుణులతో పాటు మౌలిక సదుపాయాలు, రోగులకు అవసరమైన ప్రాణవాయువు అందుబాటులో ఉండటం చిన్నారులకు కలిసి వచ్చే అంశమని ఆస్పత్రి వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

ప్రభావం ఎందుకంటే..  
ఇప్పటివరకు 65 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేశారు. 45 ఏళ్లు పైబడిన వారికి కూడా దాదాపు పూర్తి కావస్తోంది. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన సూపర్‌ స్పైడర్లకు టీకాలు వేస్తున్నారు.  పిల్లలకు టీకాలు అందుబాటులోకి రావడానికి మరో ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది. దీనికి తోడు పిల్లలు ఎక్కువ సేపు మాస్క్‌లు ధరించి ఉండలేరు. ఉదయం, సాయంత్రం వేళలో పది మంది ఒక చోటికి చేరుకుని ఆటలాడుతుంటారు. ఈ సమయంలో భౌతిక దూరం పాటించడం కూడా కష్టం. ఇప్పటికే పెద్దలంతా టీకాలు వేయించుకుని ఉండటం, ఆఫీసు, మార్కెట్లు, వ్యాపారాల పేరుతో వా రంతా బయటికి వెళ్లి వస్తుంటారు. టీకా తీసుకో వడం వల్ల వీరిలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. వైరస్‌ సోకినా.. బయటికి కన్పించదు. కానీ.. వీరి నుంచి పిల్లలకు ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంది.  
– డాక్టర్‌ రమేష్‌రెడ్డి, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు 

చదవండి: మేమంతా నిరుపేదలం..బెదిరించడం ఏమిటీ.. ఖాళీ చేసేదిలేదు

మరిన్ని వార్తలు