ఫిబ్రవరి 11–13 తేదీల్లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో 

1 Jan, 2022 03:31 IST|Sakshi

ప్రదర్శనలో రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులే 

సాక్షి, హైదరాబాద్‌: కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) ప్రాపర్టీ షో మరోసారి నగరవాసుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 11 –13 తేదీల్లో హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో క్రెడాయ్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ 11వ ఎడిషన్‌ స్థిరాస్తి ప్రదర్శన జరగనుంది. మూడు రోజుల ప్రదర్శన లేఅవుట్‌ను క్రెడాయ్‌ ప్రతినిధులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ పీ రామకృష్ణ రావు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), సేవల రంగాలలో స్థిరమైన ఉపాధి కారణంగా ఆదాయంలో వృద్ధి నమోదవుతుందని తెలిపారు. దీంతో యువతరంలో ఆకాంక్షలు పెరుగుతున్నాయని ఇది రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు దోహదమవుతుందని పేర్కొన్నారు.

రియల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టే కొనుగోలుదారుల సగటు వయస్సు 35 ఏళ్లుగా ఉంటుందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలలో 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న కొనుగోలుదారుల జనాభా తక్కువగా ఉందని వివరించారు. కరోనా తర్వాతి నుంచి హైబ్రిడ్‌ పని విధానంతో అపార్ట్‌మెంట్‌ సైజ్‌లు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. టీఎస్‌ రెరా అనుమతి పొందిన ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు, హరిత భవనాల ప్రాజెక్ట్‌లు మాత్రమే ప్రదర్శనలో ఉంటాయని జనరల్‌ సెక్రటరీ వీ రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు.

కరోనా నిబంధనలను పాటించే విధంగా ప్రదర్శనలో స్టాల్స్, ఎగ్జిబిషన్‌ లేఅవుట్‌ను రూపొందించామన్నారు. నిర్మాణ సంస్థలతో పాటూ మెటీరియల్‌ వెండర్లు, తయారీ కంపెనీలు, కన్సల్టెంట్లు, ఆర్థిక సంస్థలు కూడా ఈ ప్రదర్శనలో స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్లు జి. ఆనంద్‌ రెడ్డి, కే రాజేశ్వర్, ఎన్‌ జైదీప్‌ రెడ్డి, బీ జగన్నాథ రావు, ట్రెజరర్‌ ఆదిత్యా గౌర, జాయింట్‌ సెక్రటరీలు కే రాంబాబు, శివరాజ్‌ ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు