హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌.. ‘త్రి’ పాత్రాభినయం! 

25 May, 2022 10:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌(సిటీబ్యూరో): హైదరాబాద్‌ కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ప్రస్తుతం రాజధానిలోని మూడు కమిషనరేట్‌లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు స్టీఫెన్‌ రవీంద్ర, మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ సెలవులో ఉండటమే ఇందుకు కారణం. దీంతో రెండు కమిషనరేట్లకూ ఆయనే ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్నారు. ఇలాంటి ఘట్టం ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి. ఈ నెల రెండో వారంలో రాచకొండ కమిషనర్‌ సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఆ కమిషనరేట్‌కు సైబరాబాద్‌ సీపీని ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
చదవండి: ర్యాపిడో డ్రైవర్‌ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు

గత వారం సైబరాబాద్‌ కమిషనర్‌ సైతం సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఈ పోస్టుకు ఆనంద్‌కు ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ను చేశారు. దీంతో సాంకేతికంగా ఆయనే రెండు కమిషనరేట్లను ఇన్‌చార్జ్‌ సీపీగా మారారు. ఈ మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పరిపాలన వ్యవహారాలను ఆనంద్‌ అదనపు పోలీసు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి రోజు ఉదయం ఆయా కమిషనరేట్ల కమిషనర్లు తమ పరిధిలోని ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులు, పరిణామాలు, కార్యక్రమాలు, నిరసనలపై టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తుంటారు.

వీటికి సంబంధించి స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు రూపొందించే పెరిస్కోప్‌ (నివేదిక) పరిశీలించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్‌లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆనంద్‌ ప్రతిరోజు మూడు టెలీకాన్ఫరెన్స్‌లను నిర్వహించడంతో పాటు మూడు పెరిస్కోప్‌లను పరిశీలిస్తున్నారు. గురువారం సైబరాబాద్‌ పరిధిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో (ఐఎస్‌బీ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆనంద్‌ దృష్టి ఆ కమిషనరేట్‌పై ప్రత్యేకంగా ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన బందోబస్తు, భద్రత చర్యలపై సైబరాబాద్‌ ఉన్నతాధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయంలో సమావేశం కావడంతో పాటు ఐఎస్‌బీని సందర్శించారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ), ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), స్టేట్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో సైబరాబాద్‌ పోలీసులు సమన్వయం ఏర్పాటు చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు