‘ట్యాంపరింగ్‌’ కేసు వివరాలివ్వండి

26 Feb, 2022 01:42 IST|Sakshi

టీఎస్‌ఎంసీకి సైబర్‌ క్రైం పోలీసుల నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎంసీ) డేటాబేస్‌లో వెలుగుచూసిన రికార్డుల ట్యాంపరింగ్‌ వ్యవహారంపై తమకు పూర్తి వివరాలు, రికార్డులు అందించాలని ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్‌ క్రైం పోలీసులు ఆదేశించారు. డాక్టర్ల రిజిస్ట్రేషన్‌ విధివిధానాలు, డేటాబేస్‌ నిర్వహణ, సాంకేతిక అంశాలను తమకు సమర్పించాలని టీఎస్‌ఎంసీకి శుక్రవారం నోటీసులు జారీ చేశారు.

వివరాలన్నీ అందితేనే సాంకేతికంగా దర్యాప్తు చేయడానికి, కేసులో ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2016లో కౌన్సిల్‌లో రిజిస్టర్‌ చేసుకొని నంబర్‌ పొందిన ముగ్గురు ఎంబీబీఎస్‌ డాక్టర్ల రికార్డులను కొందరు ‘ఇంటిదొంగలు’ ట్యాంపర్‌ చేసి వేరే వ్యక్తుల పేర్లతో డేటాబేస్‌లో నమోదు చేసినట్లు వెలుగులోకి రావడం తెలిసిందే. డాక్టర్‌ నాగమణి అర్హతల విషయంలో తొలుత గందరగోళం ఏర్పడటంతో ఆమె వివరాలు ట్యాంపర్‌ అయినట్లు తొలుత భావించిన కౌన్సిల్‌... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ అంశాన్నీ చేర్చింది. అయితే నాగమణి దరఖాస్తులో పొరపాటు రావడం వల్లే అలా జరిగిందని, ఆమె అంశంలో ఎలాంటి ట్యాంపరింగ్‌ లేదని శుక్రవారం స్పష్టమైంది.  

మరిన్ని వార్తలు