హైదరాబాద్‌లో నిత్యం ఎంత మురుగు వస్తుందంటే...

8 Oct, 2022 18:11 IST|Sakshi

మహానగరంలో ప్రహసనంగా మురుగు శుద్ధి

మురుగు చేరికతో విలువైన నీటివనరులకు కాలుష్యం కాటు

మెట్రో నగరాల్లో వ్యర్థజలాల శుద్ధిపై నీతిఆయోగ్‌ ఆందోళన

మురుగు శుద్ధి.. పునర్వినియోగంపై దృష్టి సారించాలని సూచన.. 

సాక్షి, హైదరాబాద్: మహానగరంలో మురుగు శుద్ధి ప్రహసనంగా మారింది. దేశంలో పట్టణ ప్రాంతాల్లో రోజువారీగా వెలువడుతోన్న వ్యర్థజలాల్లో కేవలం 28 శాతమే శుద్ధి జరుగుతోందని ఇటీవల నీతిఆయోగ్‌ ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశమౌతోంది. ఈ నేపథ్యంలో మన నగరంలో రోజువారీగా సుమారు 2000 మిలియన్‌ లీటర్ల మురుగు జలాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో కేవలం వెయ్యి మిలియన్‌ లీటర్ల వ్యర్థజలాల శుద్ధి జరుగుతోంది. మిగతా సగం ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే జీహెచ్‌ఎంసీ పరిధిలోని 185 చెరువులతోపాటు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్, జంటజలాశయాలు, చారిత్రక మూసీ నదిని ముంచెత్తుతుండడంతో ఆయా జలవనరులు కాలుష్యకాటుకు గురవుతున్నాయి. 

దేశవ్యాప్తంగా దుస్థితి ఇదీ... 
నీతిఆయోగ్‌ ఇటీవల ‘అర్బన్‌ వేస్ట్‌ వాటర్‌ సినారియో ఇన్‌ ఇండియా’ పేరుతో విడుదల చేసిన తాజా నివేదికలో పలు ఆందోళనకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 323 నదుల్లో 351 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షించగా..ఇందులో 13 శాతం తీవ్రంగా..మరో 17 శాతం మధ్యస్థ కాలుష్యం ఉన్నట్లు తేలింది. ఆయా జలాశయాల నీటిలో భారలోహాలు, ఆర్సినిక్, ఫ్లోరైడ్స్‌ విషపూరిత రసాయనాలు, ఫార్మా అవశేషాలున్నట్లు గుర్తించారు. సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు సైతం కలుషితమైనట్లు గుర్తించారు. 


గ్రేటర్‌ సిటీలో పరిస్థితి ఇలా... 

► గ్రేటర్‌ పరిధిలో నిత్యం గృహ,వాణిజ్య,పారిశ్రామిక వాడల నుంచి 2 వేల మిలియన్‌ లీటర్ల మురుగు జలాలు ఉత్పన్నమౌతున్నాయి.
 
► ఇందులో సుమారు వెయ్యి మిలియన్‌ లీటర్ల వ్యర్థజలాలను సుమారు 25 మురుగు శుద్ధి కేంద్రాల్లో జలమండలి శుద్ధి చేస్తోంది.
 
► మిగతా మురుగు నగరవ్యాప్తంగా ఉన్న జలవనరుల్లో కలుస్తోంది. కాగా భవిష్యత్‌లో మురుగు నగరాన్ని ముంచెత్తుతోందన్న అంచనాతో మిగతా వెయ్యి మిలియన్‌ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేందుకు దశలవారీగా మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించాలని సంకల్పించింది. రాబోయే ఐదేళ్లలో నగరంలో మూడు ప్యాకేజీలుగా 31  మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నట్లు  జలమండలి ప్రకటించింది .  

► తొలివిడతగా రూ.1280 కోట్లతో నగరంలో పలు చోట్ల 17 ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులు ఈ ఏడాది చివరి వరకు పూర్తయ్యే అవ కాశాలున్నాయి. ఇక మరో 14 ఎస్టీపీలను దశలవారీగా నగరంలో నిర్మించనున్నట్లు జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిశోర్‌ తెలిపారు. మొత్తంగా 31 ఎస్టీపీలను రూ.3866.41 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని.. వీటిలో రోజువారీగా 1000– 1282 మిలియన్‌ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేయవచ్చని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్‌ బ్రిడ్జి)

మరిన్ని వార్తలు