Hyderabad: డెంగీ.. కార్పొ‘రేట్‌’ కాటు.. హడలిపోతున్న జనం 

15 Jul, 2022 02:24 IST|Sakshi

ప్రైవేటు ఆస్పత్రులపై వైద్య ఆరోగ్య శాఖకు పలు ఫిర్యాదులు 

రోగులకు ప్లేట్‌లెట్ల అవసరం లేకున్నా ఎక్కిస్తున్న వైనం 

ఒక్కో రోగి నుంచి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు 

డెంగీ విజృంభణను సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యాలు 

జ్వరం రాగానే హడలిపోతున్న జనం 

ఫిర్యాదు చేయాల్సిన వాట్సాప్‌ నంబర్‌: 9154170960

సాక్షి, హైదరాబాద్‌: కొన్నాళ్ల క్రితం వరకు కరోనా బాధితులను పీల్చి పిప్పి చేసిన అనేక ప్రైవేట్‌ ఆసుపత్రులు.. ఇప్పుడు డెంగీ రోగుల జేబులు గుల్ల చేస్తున్నాయి. తప్పుడు రిపోర్టుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయి. ప్లేట్‌లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బులు గుంజుతున్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అనవసరంగా ఫీజులు వసూలు చేయొద్దని వైద్య ఆరోగ్యశాఖ పదేపదే చెబుతున్నా కొన్ని ఆసుపత్రులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తూ రోగుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతూ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఇచ్చిన వాట్సాప్‌ నంబర్‌ (9154170960)కు పలు ఫిర్యాదులు వస్తున్నాయని ఒక అధికారి తెలిపారు. 

పెరుగుతున్న డెంగీ కేసులు 
రాష్ట్రంలో డెంగీ విజృంభించింది. కరోనా పరిస్థితుల్లో సాధారణ జ్వరం వస్తేనే ప్రజలు హడలి పోతున్నారు. జ్వరం రాగానే కరోనా పరీక్షలతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. అయితే మూడేళ్ల తర్వాత ఈసారి డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 516 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. వర్షాలు తగ్గాక మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదముందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోతే ప్లేట్‌లెట్లు 20 వేల వరకు తగ్గినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అనారోగ్య సమస్యలున్నప్పుడు మాత్రం 50 వేల లోపునకు తగ్గితే జాగ్రత్త వహించాలి. చాలావరకు కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే చికిత్సే చాలని వైద్య నిపుణులంటున్నారు. 

డెంగీ లేకున్నా.. 
అయితే డెంగీతో తమ వద్దకు వస్తున్న రోగుల వద్ద పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. రోగికి 50 వేలకు పైగా ప్లేట్‌లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుగా ఫిర్యాదులందుతున్నాయి. ఒకసారి ప్లేట్‌లెట్లు ఎక్కిస్తే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు బిల్లు వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆసుపత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇక డెంగీ ఉన్నా లేకున్నా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్‌లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి అందడం గమనార్హం. డెంగీ లేకపోయినా, ప్లేట్‌లెట్ల కౌంట్‌ సరిపడా ఉన్నప్పటికీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

తీవ్రతను తగ్గించడం ఎలా? 
డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజిని ముంచి రోగి శరీరాన్ని తుడవాలి. కాచి వడపోసిన నీటినే తాగాలి. ఎలక్ట్రాల్‌ పౌడర్‌ కలిపిన నీళ్లు, పళ్లరసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్‌లెట్లు తగ్గడం అదుపులోకి వస్తుంది. రానిపక్షంలో వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. 

రక్తస్రావం జరిగితే ప్రమాదకరం 
డెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్‌ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్త స్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. అలాగే మహిళలకు పీరియడ్స్‌ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం లేనప్పుడు 20 వేల వరకు పడిపోయినా ప్రమాదం ఉండదు. ప్రత్యేకంగా ప్లేట్‌లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. 
– డాక్టర్‌ కె.కృష్ణప్రభాకర్, కన్సల్టెంట్‌ ఫిజీషియన్, సిటీ న్యూరో ఆసుపత్రి, హైదరాబాద్‌ 

ఐజీఎం పరీక్ష తప్పనిసరి 
డెంగీకి గురైతే ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వీటితో పాటు అధిక దాహం, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో డెంగీ నిర్ధారించుకోవడానికి వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్‌లెట్‌ కౌంట్, డెంగీ స్ట్రిప్‌ టెస్ట్, సీరమ్‌ టెస్ట్‌ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్‌లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరం. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి.  

మరిన్ని వార్తలు