నేను చనిపోతాననుకున్నా : డెంటల్‌ డాక్టర్‌ హుస్సేన్‌

28 Oct, 2020 17:16 IST|Sakshi

12 గంటల లోపే కిడ్నాప్ కేసును ఛేదించాం: సీపీ సజ్జనార్

సాక్షి, హైదరాబాద్‌ : మరో పది నిమిషాలు పోలీసులు ఆలస్యం చేస్తే దుండగులు కచ్చితంగా తనను చంపేసేవారని కిడ్నాప్‌కు గురైన డెంటల్‌ డాక్టర్‌ హుస్సేన్‌ అన్నారు. తనను కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను చనిపోతానని అనుకున్నానని, పోలీసుల కృషితో బతికి బయటపడ్డానని తెలిపారు. కిడ్నాప్‌ చేసిన నిందితుడు ముస్తఫా తనతో మర్యాదగా ప్రవర్తించేవాడని, ఎక్కడా అనుమానం రాకుండా తనను అపహరించారని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం తన క్లీనిక్‌ దగ్గరికి ముస్తఫా కారు వచ్చి వెళ్లిందని, ఆ తర్వాత కొద్ది సేపటికే తన క్లీనిక్‌ లోపకిలి కొంతమంది బురఖా ధరించి వచ్చి కిడ్నాప్‌ చేశారని చెప్పారు.

కాగా, డాక్టర్‌ హుస్సేన్‌ కిడ్నాప్‌ కేసును హైదరాబాద్‌ పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. 12 గంటల్లో కేసును ఛేదించి, ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇతర రాష్ట్రాల పోలీసులు బాగా సపోర్ట్‌ చేశారని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. ముఖ్యంగా అనంతపురం పోలీసులు చాలా కోపరేట్‌ చేశారని ప్రశంసించారు. ‘కిడ్నాప్‌కు ప్లాన్ చెసిన ప్రధాన సూత్రధారి ముస్తఫా హుస్సేన్ భార్యకు దగ్గరి బంధువు. ఆస్ట్రేలియాలో బిజినెస్ చేస్తూ ముస్తఫా నష్టపోయాడు. దీంతో ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చి పూణే, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆస్ట్రేలియా లో ఉన్న సమయంలోనే పరిచమైన ఖాలీడ్‌తో కిడ్నాప్‌కు స్కెచ్‌ వేశారు.

తన దగ్గర బంధువు అయిన డెంటిస్ట్ హుస్సేన్ ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. కిడ్నాప్ స్కెచ్‌కు రెండు టీమ్ లను ఏర్పాటు చేసుకున్నారు. క్లినిక్ నుండి కిడ్నాప్ చేసిన డాక్టర్ ను కూకట్‌పల్లికి తరలించారు. అక్కడి నుంచి బెంగళూరుకు డాక్టర్ ను తరలించేందుకు మరో టీంను రెడీ చేసుకున్నారు. సుమిత్ ,అక్షయ్, విక్కీ , సల్మాన్  లు క్లినిక్ లో ఉన్న హుస్సేన్‌ను  బూరఖా ధరించి దాడి చేసి కిడ్నాప్ చేశారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి 48 గంటల్లో రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాం. మొత్తం 12 టీమ్‌లు రంగంలోకి దిగి 12 గంటల్లోనే కిడ్నాప్‌ కేసును ఛేదించాం. ఈ కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు మంచి సహకారం చేశారు. ముఖ్యంగా అనంతపురం పోలీసులు అద్భుత సహకారం అందించారు’ అని సీపీ సజ్జనర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు