పోలీసుల ప్రతిష్టను పెంచేది రిసెప్షనిస్టులే 

22 Feb, 2023 03:14 IST|Sakshi

ఫిర్యాదుదారులకు నమ్మకం కల్పించాలి: డీజీపీ అంజనీకుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖ ప్రతిష్టను పెంపొందించడంలో పోలీస్‌స్టేషన్లలోని రిసెప్షన్‌ ఆఫీసర్‌ పాత్ర కీలకమని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్‌ ఆఫీసర్‌ స్టాఫ్‌ ఫంక్షనల్‌ వర్టికల్స్‌పై తొలిసారిగా మంగళవారం రాష్ట్రంలోని 736 మంది రిసెప్షన్‌ అధికారులతో డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

డీజీపీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు 17 ఫంక్షనల్‌ వర్టికల్స్‌ ప్రవేశపెట్టామని తెలిపారు. వీటిలో మొదటిదైన రిసెప్షన్‌ ఆఫీసర్‌ వర్టికల్‌ అత్యంత కీలకమని అన్నారు. కాగా, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ను డీజీపీ ఆకస్మికంగా సందర్శించారు. పీటీవో విభాగం పనితీరు, వాహనాల నిర్వహణ విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  

త్వరలో పోలీస్‌ డ్యూటీ మీట్‌  
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ను సెప్టెంబర్‌లోగా నిర్వహించనున్నామని, ఆ బాధ్యతలను సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌కు అప్పగిస్తున్నామని డీజీపీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌లో జరిగిన ఆలిండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌లో మెడల్స్‌ సాధించిన తెలంగాణ పోలీసు అధికారులు, కోచ్‌ల సన్మాన కార్యక్రమం డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఆలిండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌లో నాలుగు విభాగాల్లో ఐదుగురికి అవార్డులు లభించాయి.  

మెడల్స్‌ సాధించింది వీరే... 
లిఖిత పరీక్ష విభాగంలో ఎల్‌.బి.నగర్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.మన్మోహన్‌కు బంగారు పతకం లభించింది. పోలీస్‌ వీడియోగ్రఫీ విభాగంలో సైబరాబాద్‌ కానిస్టేబుల్‌ అనిల్‌ కుమార్, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ విభాగంలో ఎస్‌.ఐ.బి. ఇంటెలిజెన్స్‌ ఎస్‌.ఐ. బి.వెంకటేశ్, ఇంటెలిజెన్స్‌ సెల్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ బి. విజయ్‌కి సిల్వర్‌ మెడల్స్‌ లభించాయి. యాంటీ సాబోటేజ్‌ చెకింగ్‌ విభాగంలో తెలంగాణ పోలీస్‌ శాఖకు మూడవ ట్రోఫీ లభించింది.  

మరిన్ని వార్తలు