ఆర్థిక నేరాలపై ఎస్‌హెచ్‌వోలకు అవగాహన ఉండాలి : డీజీపీ మహేందర్‌ రెడ్డి

25 Nov, 2022 01:28 IST|Sakshi

ఎస్‌పీఎఫ్‌ డీజీ ఉమేష్‌ ష్రాఫ్‌ రచించిన   ‘ఎకనామిక్‌ అఫెన్సెస్‌–హ్యాండ్‌ బుక్‌ ఫర్‌ ఇన్వెస్టిగేషన్‌’పుస్తకాన్ని ఆవిష్కరించిన డీజీపీ 

సీనియర్‌ అధికారులు తమ అనుభవాలను పుస్తక రూపంలో తేవాలని సూచన 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక నేరాలపై పోలీసు స్టేషన్‌ అధికారులకు(ఎస్‌హెచ్‌వో)లకు అవగాహన ఉండా లని రాష్ట్ర డీజీపీ పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక నేరాలు అరుదుగా జరిగేవని, వాటిని సీసీఎస్‌ లేదా సీఐడీకి బదిలీ చేసేవాళ్లమని, మారిన పరిస్థితుల్లో ఆర్థిక నేరాలు అధికమైనందున వాటి దర్యాప్తు బాధ్యతను సంబంధిత పోలీసుస్టేషన్లకు అప్పగిస్తున్నట్లు చెప్పారు.

గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీ సర్స్‌ మెస్‌లో ప్రత్యేక రక్షణ దళం(ఎస్‌పీఎఫ్‌) డీజీ ఉమేష్‌ష్రాఫ్‌ రచించిన ‘ఎకనామిక్‌ అఫెన్సెస్‌–హ్యాండ్‌ బుక్‌ ఫర్‌ ఇన్వెస్టిగేషన్‌’ను డీజీపీ ఆవిష్కరించారు. అడిషనల్‌ డీజీ జితేందర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యకమ్రంలో డీజీపీ మాట్లాడుతూ..యువ పోలీస్‌ అధికారులకు మార్గ దర్శకంగా ఉండేందుకు సర్వీసులో ఉన్న ప్రతీ సీనియర్‌ పోలీస్‌ అధికారి తమ అనుభవాలతో రచనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా నేరాల స్వభావాలలో మార్పులు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా, ఇటీవల కాలంలో ఆర్థిక పరమైన నేరాలు అధికమయ్యాయన్నారు. ఉమేష్‌ ష్రాఫ్‌ రచించిన పుస్తకాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు పంపిస్తామని, ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డీజీపీ తెలిపారు. మాజీగవర్నర్, రిటైర్డ్‌ డీజీ పి.ఎస్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ, తాను క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఆర్థికపరమైన అవకతవకలు, నేరాలు సహకార సంఘాల నుంచే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు.

ఉమేష్‌ ష్రాఫ్‌ రాసిన మరో పుస్తకం క్రిమినాలజీ అండ్‌ క్రైమ్‌ ప్రివెన్షన్‌ పరిచయ కార్యక్రమం జరిగింది. రిటైర్డ్‌ పోలీస్‌ అధికారులు ఎంవీ కృష్ణారావు, అరవింద్‌ రావు, సాంబశివరావు, ఉమేష్‌ కుమార్, రాజీవ్‌ త్రివేది, రత్నారెడ్డిలతోపాటు అడిషనల్‌ డీజీలు గోవింద్‌ సింగ్, అంజనీకుమార్, శివధర్‌రెడ్డి, రాజీవ్‌ రతన్, సంజయ్‌ జైన్, విజయ్‌ కుమర్, అభిలాష బిష్త్, నాగిరెడ్డి, కమలహాసన్‌ రెడ్డి హాజరయ్యారు.   

మరిన్ని వార్తలు