కేసుల్లో ఈ కేసులు వేరయా.. పతి, పత్నీ ఔర్‌ ఓ.. ప్చ్‌! యాప్‌ ఎంతపని చేసింది?

31 Oct, 2022 15:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర కమిషనరేట్‌ పరిధిలోని మహిళ, సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్లకు అనునిత్యం పదుల సంఖ్యలో బాధితులు వస్తుంటారు. వేధింపులు ఎదురైన, బెదిరింపులకు లోనైన వారితో పాటు ఆర్థికంగా నష్టపోయిన వాళ్లూ వీటి మెట్లు ఎక్కుతారు. అప్పుడప్పుడు ఈ ఠాణాలకు వస్తున్న కొన్ని కేసులు పోలీసులనే షాక్‌కు గురి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎవరికి ఎలా న్యాయం చేయాలో, ఎవరికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇటీవల పోలీసుల వద్దకు వచ్చిన ఆ తరహాకు చెందిన కేసుల్లో కొన్ని... 

పతి, పత్నీ ఔర్‌ ఓ... 
భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడనో, ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనో, పెళ్లి పేరుతో ప్రేమాయణం నడిపి మోసం చేశాడనో...ఇలా అనే కేసులు పోలీసుల వద్దకు వస్తుంటాయి. అయితే బుధవారం మహిళ ఠాణాకు వచ్చిన ఓ కేసు అధికారులకే మతి పోగొట్టింది. వివాహితుడైన ఓ వ్యక్తికి ఆన్‌లైన్‌లో నగరానికే చెందిన యువతితో పరిచయమైంది. వీరి మధ్య ప్రేమ చిగురించడం అనేక కేసుల్లో వింటూనే ఉంటాం. ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే... ఈ ప్రేమాయణం కథ మొత్తం అతడి భార్యకూ తెలిసి ఉండటం. ఈ భార్య, ఆ ప్రియురాలు ఓ అండర్‌ స్టాడింగ్‌కు వచ్చి కలిసే అతడితో కాపురం చేసుకుంటామని నిర్ణయించుకున్నారు.

ఈ విషయం సదరు యువతి ఇంట్లో తెలియడంతో కథ అడ్డం తిరిగింది. వివాహితుడికి రెండో భార్యగా ఉంటావా? అంటూ యువతిని మందలించారు. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో విషయం ఠాణా వరకు వచి్చంది. ‘నా భర్త ఆమెను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే.. ముగ్గురం కలిసే ఉంటాం’ అంటూ భార్య, ‘ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను’ అంటూ యువతి చెప్తుండగా... ఆమె తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. భార్య ఉండగా ఆమె సమ్మతించినా రెండో పెళ్లి చేసుకోవడం నేరమంటూ చట్టాన్ని వివరించిన పోలీసులు ముగ్గురికీ కౌన్సిలింగ్‌ చేశారు. ఫలితంగా పరిస్థితులు అదుపులోకి రావడంతో ఎవరి ఇళ్లకు వాళ్లు చేరారు.  

నిందితుడిగా మారిన మాజీ ప్రియుడు...  
వివాహిత అయిన మాజీ ప్రేయసి నుంచి సందేశం అందుకున్న ఆ ప్రియుడు ఎగిరి గంతేసి మరీ లండన్‌ నుంచి నగరానికి వచ్చాడు. సీన్‌ కట్‌ చేస్తే ఆమే తనను పెళ్లి పేరుతో వేధిస్తున్నాడంటూ అతడిపై సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. అతను నగరంలో చదువుకునే సమయంలో ఈమెతో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన ఈ జంట ప్రయాణం పెళ్లి వరకు వెళ్లలేదు. మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి కావడంతో అతడు ఉద్యోగరీత్యా లండన్‌ వెళ్లిపోయాడు.

వివాహమైన కొన్నాళ్లకే భర్తతో విభేదాలు రావడంతో ఆమె విడాకులు తీసుకోవాలని భావించింది. ఆ తంతు పూర్తయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామంటూ మాజీ ప్రియుడికి సందేశం ఇచ్చింది. ఇంకేముంది ఉన్న ఫళంగా నగరానికి వచ్చేశాడు. ఆమె భర్తతోనే కలిసి ఉండటాన్ని చూసి అవాక్కయ్యాడు. పెళ్లి చేసుకుందామంటూ పదేపదే ఆమెకు సందేశాలు పెట్టాడు. విడాకులు తీసుకోకుండా అదెలా సాధ్యమంటూ దాటవేస్తూ వచ్చింది. అలాంటప్పుడు తనను ఎందుకు రమ్మన్నావంటూ అతడు గొడవకు దిగాడు. తన వేదనను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశాడు. కట్‌ చేస్తే బాధితురాలిగా మారిన ఆ యువతి తన మాజీ ప్రియుడి పైనే సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు పెట్టింది. కౌన్సిలింగ్‌తో ఈ కథ లండన్‌కు చేరింది.  
చదవండి: కీచక ఉపాధ్యాయులు.. మొన్న మహిళా ఉద్యోగి.. నేడు విద్యార్థినితో

యాప్‌... ఎంతపని చేసింది... 
ఓయూ ప్రాంతానికి చెందిన ఓ నిరక్షరాస్యుడు గొర్రెలు, మేకల వ్యాపారి. ఇతడికి స్థానికంగా ఉండే యువతితో పరిచయమైంది. ఇద్దరూ కొన్నాళ్లు చెట్టపట్టాలుగా తిరిగారు. నిరక్షరాస్యుడని తెలియడం..ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఆమె అతడిని దూరంగా పెట్టింది. దీంతో తనను ప్రేమిస్తున్నానంటూ మోసం చేసిందని వ్యాఖ్యానిస్తూ ఇన్‌స్ట్రాగామ్‌లో యువతి ఫొటోతో సహా అతడు పోస్టు చేశాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య చాటింగ్‌ యుద్ధం కూడా జరిగింది.

అవాక్కైన పోలీసులు
ఆవేదనకు గురైన ఆమె అతడిపై సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించింది.  నిరక్షరాస్యుడైన అతడికి చాటింగ్, పోస్టులు పెట్టడం రాదని, అతడి వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించింది. కేసు నమోదు కావడంతో ఆ యువకుడిని పోలీసులు ఠాణాకు తీసుకొచ్చారు. విచారణ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన విషయాలు విని అవాక్కయ్యారు. ఏ మాత్రం ఆంగ్ల పరిజ్ఞానం లేని అతడు ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు.

ఆ యువతి పంపిన సందేశాన్ని కాపీ చేసి అందులో పేస్ట్‌ చేసే వాడు. దానికి ఏం సమాధానం చెప్పాలన్నది ఆ యాప్‌ సూచించేది. దాన్ని మళ్లీ కాపీ చేసే అతడు యువతికి పోస్టు చేసేవాడు. కొన్నిసార్లు వాయిస్‌ కమాండ్స్‌ను టెక్టస్‌గా మార్చి పోస్టు చేసే వాడు. నిందితుడిగా మారిన అతగాడు తనను ఆ యువతి ఎలా మోసం చేసిందో కూడా వివరించాడు. ఈ విషయాలను ఆమె కూడా అంగీకరించడంతో అరెస్టు పర్వం తప్పింది.  

మరిన్ని వార్తలు