రివిజన్‌తో విన్‌!

18 Mar, 2022 02:28 IST|Sakshi

చదవడమే కాదు సమీక్షా తప్పనిసరి 

నిరంతర శ్రమతో విజయం తథ్యం

సిలబస్‌ అంశాలపైనే దృష్టి పెట్టాలి

రాతలో నైపుణ్యం మెరుగుపర్చుకోవాలి 

గ్రూప్స్‌ అభ్యర్థులకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ సలహాలు, సూచనలు 

పట్టుదలతో చదివితే లక్ష్యాన్ని చేరవచ్చు. ఆశయసాధనలో అలుపెరగక ముందుకు సాగితే విజయం సాగిలపడుతుంది. నిరంతర శ్రమతో.. అకుంఠిత దీక్షతో అహరహం తపిస్తే గెలుపు బాట తథ్యం అంటున్నారు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌. సర్కారీ కొలువుల నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో గ్రూప్స్‌ అభ్యర్థులకు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ముచ్చటించారు.

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ముందు సిలబస్‌పై అభ్యర్థులకు అవగాహన అవసరమన్నారు. దానికి అనుగుణంగా మెటీరియల్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించాలని, జనరల్‌ నాలెడ్జి పెంచుకోవాలన్నారు. పరీక్షల్లో తొలి మెట్టుకు ఈ రెండు అంశాలు దోహదపడతాయని శర్మన్‌ స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏం సూచించారంటే..  
– సాక్షి, హైదరాబాద్‌

ఎంత అర్థమైందన్నదే పాయింట్‌
చదవడంతో పాటు నిరంతరం సమీక్షించు కోవాలి. గంటలకొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు.. ఎంత వరకు అర్థమైందనేది ప్రధానం. ఇష్టంగా అర్థం చేసుకుంటూ చదవాలి. పరీక్షకు హాజరయ్యే లోపు కనీసం రెండుసార్లయినా రివిజన్‌ చేస్తేనే çపట్టు వస్తుంది.

ఒకేసారి సిద్ధం కావాలి
గ్రూప్స్‌ అభ్యర్థులకు ప్రిలిమ్స్‌ తర్వాత మెయి న్స్‌ పరీక్షకు లభించే కాల వ్యవధి సరిపోదు. దీంతో ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్‌కు ఒకేసారి సిద్ధం కావడం ప్రారంభించాలి. లాంగ్‌ ఆన్సర్‌ రాయాల్సి ఉంటుంది. రైటింగ్‌ స్కిల్స్‌ పెంచుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే పరీక్ష విధానం అర్థమవుతుంది. జవాబు ఎంత వరకు రాయాలో తెలుస్తుంది. ప్రతి దానిని సూక్ష్మంగా గమనించి దానికి అనుగుణంగా సిద్ధమయ్యేందుకు ప్రయత్నించాలి.

ఆప్షనల్‌ సబ్జెక్టులు కీలకం
గ్రూప్‌ మెయిన్స్‌ కోసం ఆప్షన్లు నిర్ణయించు కోవడం కీలకం. ఆసక్తిని బట్టి ఆప్షన్లు నిర్ణయిం చుకోవాలి. సంబంధిత సబ్జెక్టుల్లో గట్టి పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే పరీక్ష సునాయాసంగా రాసేందుకు వీలుంటుంది. మెయిన్స్‌ ఇంటర్వ్యూలో సైతం ఆప్షన్స్‌పై అధిక ప్రశ్నలు అడుగుతారు..

అవసరం లేని సమాచారం వద్దు
రెండు దశాబ్దాల క్రితం వరకు పోటీ పరీక్షలకు సమాచారం సేకరణ కష్టంగా ఉండేది. ప్రస్తుతం గూగుల్‌ సమాచార గనిగా మారింది. అనవసరమైన సమాచారం సేకరించకుండా సిలబస్‌కు అనుగుణంగా  సమాచారం మాత్రమే సేకరించి వాటిపై దృష్టి సారించాలి. 

సమాధానాలతో సంతృప్తి పర్చాలి
ఇంటర్వ్యూల్లో బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలతో  సంతృప్తి పర్చగలగాలి. బోర్డు సభ్యుల దగ్గర అభ్యర్థి పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న వేస్తారు. అందులో వ్యక్తిగత, నేటివిటీ, రాష్ట్రీయ, జాతీయ, సున్నితమైన, ఉద్యోగం సంబంధించి తదితర ప్రశ్నాలు సంధిస్తారు. వాటికి ఎలాంటి టెన్షన్‌ లేకుండా సునా యసంగా జవాబు ఇవ్వాలి. తెలియకుంటే తెలియదని స్పష్టంగా చెప్పాలి. తెలియకున్నా.. చెప్పడానికి ప్రయత్నించవద్దు.

సమయపాలన ప్రధానం
పోటీ పరీక్షల్లో సమయ పాలన కూడా ప్రధానం. సమయం వృథా చేయకుండా సంబంధిత సబ్టెక్టులపై పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలి. పరీక్ష రాసేటప్పుడు కూడా ముందుగానే  ప్రశ్నలకు సమయం కేటాయించుకొని పూర్తి చేసే విధంగా ప్రయత్నించాలి.   

మరిన్ని వార్తలు