Gandhi Hospital: ఆస్పత్రిలో ‘గుండె’ గోస

12 Nov, 2021 09:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి కార్డియాలజీ విభాగంలోని క్యాత్‌ల్యాబ్‌ గత పద్దెనిమిది నెలలుగా మూలనపడింది. అత్యంత ప్రాధాన్యం కలిగిన కార్డియాలజీ విభాగం ప్రభుత్వ, వైద్య ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి గురి కావడంతో గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందక హృద్రోగులు విలవిల్లాడుతున్నారు.  

2010లో ఏర్పాటు.. 

గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో కార్డియాలజీ విభాగంలో 2010లో క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. గాంధీ కార్డియాలజీ ఓపీ, ఐపీ విభాగంలో నిత్యం వందలాది మంది రోగులు సేవలు పొందుతుంటారు.  

  గుండె సంబంధ వ్యాధులను నిర్ధారించేందుకు నాలుగైదు దశల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈసీజీ, టుడీఎకో, ట్రెడ్‌ మిల్‌ టెస్ట్‌ (టీఎంటీ) తదితర పరీక్షల్లో కొన్నిరకాల రుగ్మతలు, యాంజియోగ్రాం, పెర్యూటేనియస్‌ ట్రాన్సుమినల్‌ కొరునరీ యాంజియోఫ్లాస్ట్రీ (పీటీసీఏ), ప్రోటోన్‌ పంప్‌ ఇన్‌హేబిటర్‌ (పీపీఐ), ట్రెపోనిమా పల్లిడం ఇమ్మోబిలైజేషన్‌ (టీపీఐ) తదితర అత్యంత కీలకమైన వైద్యపరీక్షలు క్యాత్‌ల్యాబ్‌లోనే నిర్ధారణ అవుతాయి.  

► క్యాత్‌ల్యాబ్‌ నివేదిక ప్రకారమే రోగికి స్టంట్‌ వేయాలా? శస్త్రచికిత్స నిర్వహించాలా? అనేది నిర్ణయిస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించక క్యాత్‌ల్యాబ్‌ మెషీన్‌ పలుమార్లు మొరాయించింది. కాలపరిమితి ముగిసిన  క్యాత్‌ల్యాబ్‌ మెషీన్‌ మరమ్మతులకుæ లక్షలాది రూపాయల వ్యయమవుతుందని, కొత్తది సమకూర్చుకోవడం మేలని సంబంధిత నిపుణులు స్పష్టం చేశారు.  

► ప్రభుత్వ ఆస్పత్రుల్లో  వైద్య యంత్రాలు, పరికరాల కొనుగోలు, నిర్వహణ బాధ్యతల కేటాయింపులను తెలంగాణ వైద్యవిద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) చూస్తోంది. గాంధీ ఆస్పత్రిలో నూతనంగా క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చక పోవడం గమనార్హం. 

 వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన హరీష్‌రావు స్పందించి నూతన క్యాత్‌క్యాబ్‌ ఏర్పాటు చేసి నిరుపేద హృద్రోగుల గుండె చప్పుడు ఆగిపోకుండా చూడాలని పలువురు కోరుకుంటున్నారు.  

ప్రభుత్వానికి నివేదిక అందించాం  
గాంధీ ఆస్పత్రిలో క్యాత్‌ల్యాబ్‌ పని చేయని విషయాన్ని ప్రభుత్వంతో పాటు వైద్య ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వివరించాం. కాలపరిమితి ముగిసిన గాంధీ  క్యాత్‌ల్యాబ్‌ మరమ్మతులకు రూ. 45 లక్షలు, ఏడాది నిర్వహణకు మరో రూ. 30 లక్షలు అవసరం. రూ.75 లక్షలు వ్యయం చేసే బదులు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న నూతన క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని ఇంజినీరింగ్‌ నిపుణులు సూచించారు.

ఈ విషయాలన్ని నివేదిక రూపంలో అందించగా నూతన క్యాత్‌ల్యాబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. త్వరలోనే అందుబాటులోకి తెచ్చి నిరుపేద హృద్రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. 

 – రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌   

మరిన్ని వార్తలు