Durgam Cheruvu Boating: హుషారుగా.. బోటింగ్‌ షికారు

3 Sep, 2021 08:07 IST|Sakshi
ఆగస్టు 15న దుర్గమ్మ చెరువులో యాచ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సెయిలింగ్‌ ప్రదర్శన (ఫైల్‌) 

∙‘దుర్గం చెరువు’కు పెరుగుతున్న సందర్శకులు

సరస్సులో బోటింగ్‌ చేసేందుకు ఆసక్తి

పక్కాగా కోవిడ్‌ నిబంధనలు అమలు

‘సాక్షి’తో దుర్గం చెరువు ఏజీఎం బాలకృష్ణ

సాక్షి, మాదాపూర్‌: ఇటు ఆకాశ హార్మ్యాలు.. అటు ఎత్తైన కేబుల్‌ బ్రిడ్జి.. చుట్టూ పచ్చని చెట్లు.. కొలువైన వివిధ రకాల విగ్రహాలు...సరస్సులోని నీటిని ముద్దాడుతున్న సూర్యకిరణాలు... విదేశాల్లో  ఉన్నామా .. అనే అనుభూతి.. ఇలాంటి వాతావరణంలో బోటింగ్‌ అంటే నచ్చనివారు ఎవరుంటారు చెప్పండి?.ప్రశాంత వాతావరణానికి కేరాఫ్‌గా ఉన్న మాదాపూర్‌ దుర్గంచెరువులో బోటింగ్‌ చేసేందుకు సందర్శకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 
చదవండి: దుర్గం చెరువు బ్రిడ్జి... ఈ వీడియో చూశారా ? 

చెరువు వద్ద ఏర్పాటు చేసిన రాతి జంట చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చిన్నా.. పెద్దా అంతా కేరింతలు కొడుతూ ఉత్సాహంగా బోటింగ్‌ చేస్తున్నారు. సందర్శకులు బోటింగ్‌ చేసేందుకు కలి్పంచిన ఏర్పాట్లు, కోవిడ్‌ నిబంధనల అమలుకు తీసు కున్న చర్యలు తదితర అంశాలపై  దుర్గం చెరువు ఏజీఎం బాలకృష్ణతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... 

సాక్షి : ఇక్కడ ఎన్ని బోట్లు ఉన్నాయి? 
జవాబు: మొత్తం ఏడు ఉన్నాయి. నాలుగు పెడల్‌ బోట్లు, ఒకటి డీలక్స్‌ బోటు, ఒకటి స్పీడ్‌ బోటు, ఒకటి ఫ్యామిలీ బోటు ఉన్నాయి. 

సాక్షి: బోటింగ్‌ ఫీజుల వివరాలు తెలపండి. 
జవాబు:బోట్లు పూర్తి కండీషన్‌తో ఉండేలా చూస్తున్నాం. పెడల్‌ బోటింగ్‌ ఒకరికి రూ.50 (15 నిమిషాలు), డీలక్స్‌ బోట్‌ రూ.50 (15 నిమిషాలు), స్పీడ్‌బోట్‌ రూ.400 (నలుగురికి 6 నిమిషాలు)క్రూస్‌ బోట్‌ (ఫ్యామిలీ బోట్‌) 50 మంది కెపాసిటీ ఉంటుంది. ఒకరికి రూ.50 (15 నిమిషాలు) 

సాక్షి: కోవిడ్‌ జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు? 
జవాబు:కోవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నాం.  సందర్శకులు దిగిన వెంటనే బోట్లకు శానిటైజ్‌ చేయడం, తప్పని సరిగా సందర్శకులు మాస్‌్కలు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం., ప్రతి సందర్శకుడు లైఫ్‌ జాకెట్‌లు ధరించేలా చూస్తున్నాం.

సాక్షి: సందర్శకుల తాకిడి ఎలా ఉంది? 
జవాబు: సోమవారం నుంచి శుక్రవారం వరకు సందర్శకులు 200 నుంచి 300 మంది వరకు వస్తున్నారు. అదే శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో ఎక్కువ మంది  వస్తుంటారు. ఆదివారం సుమారు 600 నుంచి 800 మంది బోటింగ్‌ చేస్తుంటారు. సందర్శకులకు మరిన్ని వసతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. 

సాక్షి: కొత్త ప్రణాళికలు ఏమైన ఉన్నాయా? 
జవాబు:పిల్లలకు, పెద్దలకు, సెయిలింగ్, కయాకింగ్, కానోయింగ్‌ వంటి పర్యావరణ అనుకూల క్రీడలను నేర్పించడానికి యాచ్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరా>బాద్‌ ముందుకొచి్చంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది.  

సాక్షి: సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారా?  
జవాబు: సీనియర్‌ సిటిజన్లు తమకు రాయితీ ఇవ్వాలని, తినుబండారాలు అందుబాటులో ఉంచాలని, సేద తీరేందుకు కూర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు టాయిలెట్లు, తాగునీటి వసతి కల్పించాలని కోరుతున్నారు. పై విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. 

మరిన్ని వార్తలు