ఆనర్స్‌.. బోధించేవారు లేరు సార్‌!

3 Jan, 2022 01:32 IST|Sakshi

ఫ్యాకల్టీ కొరతతో గాడితప్పిన కోర్సు

ఇతర రాష్ట్రాల అధ్యాపకులతో బోధన చేపట్టేందుకు కసరత్తు

వారు సుముఖంగా లేకపోవడంతో అధికారుల మల్లగుల్లాలు

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యామండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బీఏ ఆనర్స్‌ కోర్సు ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి తీసుకొచ్చిన ఈ కోర్సు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం లేదు. ఇప్పుడున్న కోర్సులకన్నా భిన్నంగా వీటిని ముందుకు తీసుకెళ్లాలని భావించినప్పటికీ ఫ్యాకల్టీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీన్ని పరిష్కరించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది నిజాం కాలేజీలో ఎకనామిక్స్, కోఠి ఉమెన్స్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులను ఆనర్స్‌గా ప్రారంభించింది. సీట్లు కూడా భర్తీ అయ్యాయి.

ప్రాజెక్టు వర్క్, ఫీల్డ్‌ స్టడీ ఎక్కువగా ఉండేలా సిలబస్‌ రూపొందించారు. సామాజిక అవసరాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావించారు. అయితే, రాష్ట్రంలో ఆ స్థాయిలో ప్రత్యేక బోధన చేపట్టగల అధ్యాపకులు దొరకడం లేదు. ఇతర రాష్ట్రాల్లోని అధ్యాపకుల కోసం సైతం వేట మొదలు పెట్టారు. ఈ ప్రయత్నంలోనూ అవాంతరాలు ఎదురవుతున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎలాంటి పురోగతి కన్పించడం లేదనే విమర్శలొస్తున్నాయి. (బాసర ట్రిపుల్‌ఐటీకి న్యాక్‌ ‘సి’ గ్రేడ్‌.. అధికారుల తీరే కారణమా..?)

నిపుణుల కోసం వేట.. 
►  ఆనర్స్‌ కోర్సుల్లో ఎదురవుతున్న సమస్యలపై ఇటీవల అధికారులు చర్చించారు. నిపుణుల కోసం జల్లెడ పట్టాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్‌ సైన్స్, ఎకనామిక్స్‌ బోధన విజయవంతంగా సాగుతుండటంతో అక్కడి అధ్యాపకులను రప్పించేందుకు సంప్రదింపులు చేపడుతున్నారు. కానీ పూర్తిస్థాయి బోధనకు వారు సుముఖంగాలేరని తెలిసింది. హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఒక క్లాసు చెప్పగలమే తప్ప పూర్తిస్థాయిలో బోధించలేమని వారు చెబుతున్నారు. దీంతో కచ్చితమైన ప్రణాళిక కష్టమని అధికారులు వాపోతున్నారు.

► వీలైతే ఇతర రాష్ట్రాల అధ్యాపకుల చేత ఆన్‌లైన్‌ క్లాసులైనా ఇప్పించాలనుకుంటున్నారు. దీనికోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రయోగం ఏమేర సత్ఫలితాలనిస్తుందనేది చెప్పలేమని అధికారులు అంటున్నారు. కొత్త కోర్సు కావడంతో విద్యార్థుల సందేహాల నివృత్తి వీలవుతుందా అనే అనుమానాలున్నాయి. ఇతర రాష్ట్రాల ఫ్యాకల్టీ ఆన్‌లైన్‌ ద్వారా కొద్దిసేపు మాత్రమే బోధించే వీలుందని నిజాం కాలేజీ అధ్యాపకుడు ఒకరు చెప్పారు.

► ప్రముఖులతో విశ్లేషణలు ఆనర్స్‌ కోర్సుల్లో ప్రధానాంశం. అవసరమైతే ఆర్‌బీఐ మాజీ గవర్నర్, ఆ స్థాయి అధికారులతో ఆర్థిక శాస్త్రంలో మార్పులపై చెప్పిస్తామని అధికారులు చెప్పినా.. ఇంతవరకు సరైన ప్రణాళిక లేదు. ఎవరిని, ఎప్పుడు పిలవాలి? అనే దానిపై విద్యార్థులకు ఎలాంటి షెడ్యూల్‌ ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు