Hyderabad: ఇంత దారుణమా.. ఐదు లీటర్లకు హాఫ్‌ లీటర్‌ పెట్రోల్‌ కొట్టేస్తున్నారు

20 Nov, 2022 16:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహానగరంలోని పెట్రో బంకుల చిప్‌ ట్రిక్స్‌ ఆగడం లేదు. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం మ్యానువల్‌ పెట్రోల్‌ బంకుల మోసాలను  అడ్డుకట్ట వేసేందుకు ఎలక్ట్రానిక్, డిజిటల్‌ ఫిల్లింగ్‌ డిస్పెన్సరీ యూనిట్లు అమల్లోకి తీసుకొచ్చినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఊహకు అందని సరికొత్త మోసాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌ శివరాంపల్లిలోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకుపై ఫిర్యాదులు రావడంతో తూనికలు, సివిల్‌ సప్లయిస్, ఎస్‌ఓటీ పోలీసులు  తనిఖీలు నిర్వహించగా డిస్పెన్సరీ మిషన్‌ సాఫ్ట్‌వేర్‌లో చిప్‌ అమర్చినట్లు బయటపడింది. ఐదు లీటర్ల పెట్రోల్‌కు దాదాపు 500 ఎంఎల్‌ తక్కువగా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని బంకులపై అధికారులు దాడులు దిగినప్పటికి అప్పటికి డీలర్లు అప్రమత్తం కావడంతో ఫలితం లేకుండా పోయింది. 

అంతా గప్‌ చిప్‌.. 
పెట్రోల్‌ బంక్‌ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేతివాటం ‘గప్‌ చిప్‌’గా కొనసాగుతూనే ఉంది. డిజిటల్‌ ఫిల్లింగ్‌ డిస్పెన్సరీ యూనిట్లలో అడిషనల్‌ మైక్రో చిప్స్, రిమోట్‌ కంట్రోల్, సాఫ్ట్‌వేర్‌ పోగ్రామింగ్, ఇన్సిస్టెంట్‌ అప్లికేషన్‌ ఇన్‌స్టాలేషన్‌ తదితర అక్రమ మార్గాలు బట్టబయలైనా తాజాగా  డిస్పెన్సరీ టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేషన్‌ మెకానిజం మాత్రం ఆగడం లేదు. డిస్‌ప్లేలో మీటర్‌ రీడింగ్‌ కరెక్ట్‌గానే చూపిస్తున్నా తెరమాటున పెట్రోల్, డీజిల్‌ మెజర్‌మెంట్‌ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. డిస్పెన్సరీ మ్యానూఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ మాజీ టెక్నిషియన్ల నైపుణ్యత పెట్రోల్‌ బంకు యాజమానులకు కాసులు కురిపిస్తోంది. 

డిస్‌ప్లేలో ఓకే...కానీ 
పెట్రోల్‌ బంక్‌ బాయ్‌ కీ బోర్డుపై బట¯న్‌ నొక్కి మీటర్‌ను(జీరో) సున్నా చూపించి టకీమని మనం చెప్పినంత పెట్రోలు కొడతాడు. ఫిల్లింగ్‌ మిషన్‌ డిస్‌ప్లే బోర్డులో మీటర్‌ రీడింగ్‌ మిల్లీ లీటర్లు... అమోంట్‌ కరెక్ట్‌గా ఉండటం చూసి  లెక్క సరిపోయిందని నిర్ధారించుకుంటాం. డబ్బులు చెల్లించి అక్కడి నుంచి కదులుతాం. మన డబ్బుకు సరిపోనూ పెట్రోల్‌ మన బండి ట్యాంకులోకి పడిందని అనుకుంటే పొరపాటే... లీటరుకు 850 నుంచి 900 మిల్లీ లీటర్లే  చేరుతుంది.! దీంతో 100 నుంచి 150 మిల్లీలీటర్లు నష్టపోవాల్సిందే. 

చేతివాటం ఇలా.. 
►పెట్రోల్‌ బంకు ఫ్యూల్‌  మీటర్‌ (డిస్పెన్సరీ) యూనిట్‌లో మెజరింగ్‌ సిస్టమ్‌గా పనిచేసే పల్సర్‌ విభాగానికి సర్యూ్యట్‌తో కూడిన అదనపు కేబుల్‌ను అనుసంధానించి కీ ప్యాడ్‌ కనెక్ట్‌ ద్వారా పంప్‌ను ఆపరేట్‌ చేస్తూ సర్దుబాటు కొలతల ప్రకారం  తక్కువగా పెట్రోల్, డీజిల్‌ డెలివరీ చేస్తూ మోసం చేస్తున్నారు. 
►ఫ్యూయల్‌ డిస్పెన్సరీ యూనిట్‌లోని మదర్‌ బోర్డులో ఐసీ సర్క్యూట్‌ ద్వారా ‘ఇన్సిస్టెంట్‌ అప్లికేషన్‌ ఇన్‌స్టాలేషన్‌’తో అడ్జెస్ట్‌ చేసిన మెజర్‌మెంట్‌ ప్రకారం ఫ్యూల్‌ ఆయిల్‌ డెలివరీలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 
►డిస్పెన్సరీ యూనిట్లలో సీల్‌కు సైతం సాల్టరింగ్‌ బాహాటంగానే సాగుతున్నట్లు  తెలుస్తోంది. తూనికలు, ఆయిల్‌ కంపెనీల అధికారులతో పాటు ఇద్దరు టెక్నీషియల్‌ సమక్షంలో పంపింగ్‌ మిషన్‌లో మెజర్‌మెంట్‌ను పరిశీలించి మోసాలకు పాల్పడకుండా మీటరింగ్‌ యూనిట్, పల్సర్‌(సెన్సర్‌), మదర్‌ బోర్డు, కీ ప్యాడ్, కంట్రోలర్‌ కార్డులకు సీల్‌ చేస్తున్నా...బంకు నిర్వహకులు  సీల్‌ను బ్రేక్‌ చేయడమే కాకుండా తిరిగి అదే రకమైన వైర్‌తో సీల్‌కు సాల్టరింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

బయట పడకుండా అప్రమత్తమే  
అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు డిస్పెన్సరీ యూనిట్‌ ఆఫ్‌–ఆన్‌చేసి మెజర్‌మెంట్‌లో ఎలాంటి వ్యత్యాసం కనిపించకుండా బంకు నిర్వాహకులు జాగత్త పడుతున్నారు. యూనిట్‌ ఆఫ్‌ చేసి ఆన్‌ చేస్తే అందులో ఇనిస్టాల్‌చేసిన ఇన్సిస్టెంట్‌ అప్లికేషన్‌  ఎగిరిపోయి పాత మేజర్‌మెంట్‌ ప్రకారం ఆయిల్‌ డెలివరీ అవుతోంది. తిరిగి కొలతల హెచ్చు తగ్గుల కోసం ఇన్సిస్టెంట్‌ అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవడం సర్వసాధారమైంది. 

ఇదీ నిబంధన 
తూనికలు కొలతల శాఖ నిబంధన ప్రకారం కనీసం 5 లీటర్లలో 25 ఎంఎల్‌ కంటే ఎక్కువగా షార్టేజ్‌ రావొద్దు. ఒక వేళ వస్తే తక్షణమే సంబంధిత డిస్పెన్సరీ నాజిల్‌ను సీజ్‌ చేసి నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. కాంపౌండింగ్‌ విధించడమే కాకుండా కొన్నిసార్లు కేసులు కూడా నమోదు చేసి కోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది.    

మరిన్ని వార్తలు