710 గ్రాముల బరువుతో 27 వారాలకే చిన్నారి జననం.. 112 రోజులు ఎన్‌ఐసీయూలోనే

2 Jun, 2022 17:24 IST|Sakshi
పాపతో తల్లి రూబీదేవి..

సాక్షి, హైదరాబాద్‌: ఏడు వరుస అబార్షన్ల తరువాత ఎనిమిదో సారి పుట్టిన పాప లోకాన్ని చూడగలిగింది. కానీ, కేవలం 710 గ్రాముల బరువు మాత్రమే ఉండడంతో పాటు 38 వారాలకు జరగాల్సిన ప్రసవం 27 వారాలకే జరగడం..పాప శరీరాకృతి  పూర్తిగా లేకపోవడం వంటి పరిణామాలను సవాల్‌గా తీసుకున్న సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ వైద్యులు ఆ చిన్నారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించారు. 112 రోజుల పాటు ఎన్‌ఐసీయూలో అత్యుత్తమ వైద్య సేవలందించి పునర్జన్మను ప్రసాదించారు. బుధవారం సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ పీడియాట్రిక్స్‌ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ కోదండపాణి, పీడియాట్రిక్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జీవీఎస్‌ సుబ్రహ్మణ్యం అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ అపరాజిత డిసౌజా వివరాలు వెల్లడించారు.

మేడ్చల్‌కు చెందిన వినోద్‌కుమార్‌ భార్య రూబీదేవి వరుసగా ఏడు సార్లు గర్భస్రావం కావడంతో పాటు ఎనిమిదోసారి గర్భం దాల్చిన తరువాత తీవ్రమైన గైనిక్‌ సమస్యలతో 18వ వారంలోనే ఆస్పత్రికి చేరింది. 27వ వారంలో పాపకు జన్మనిచ్చింది. అయితే పాప కేవలం 710 గ్రాములు మాత్రమే ఉండడంతో అవయవాలు పూర్తిగా ఆకారం దాల్చలేదు. దీంతో చిన్నారిని ఎన్‌ఐసీయూలో ఉంచి పీడియాట్రిక్స్‌ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ కోదండపాణి, ప్రొఫెసర్‌ డాక్టర్‌ జీవీఎస్‌ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో చికిత్స అందించారు.  పాపను 112 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడి బరువును 1.95 కిలోలకు తీసుకువచ్చి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దారు. 

సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ వైద్యులు తమ పాప ప్రాణాలను నిలిపేందుకు చేసిన కృషిని తాము దగ్గరుండి చూశామని, వారి రుణం తీర్చుకోలేదని పాప తల్లిదండ్రులు వినోద్‌కుమార్, రూబీదేవి పేర్కొన్నారు. బుధవారం డిశ్చార్జి అవుతున్న సందర్భంగా పాప తల్లిదండ్రులు వైద్య సేవలందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ఈఎస్‌ఐసీలో అత్యుత్తమ వైద్యం అందించారన్నారు.

మరిన్ని వార్తలు