హైదరాబాద్‌ ప్రజలకు గుడ్‌న్యూస్‌: ఎంఎంటీఎస్‌ సీజన్‌ టికెట్‌ గడువు పొడిగింపు

23 Jun, 2021 13:27 IST|Sakshi

నగదు రహిత కొనుగోలుపై బోనస్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంఎంటీఎస్‌ సీజనల్‌ టిక్కెట్ల గడువును పొడిగించారు. కోవిడ్‌ కారణంగా గతేడాది మార్చి నుంచి నిలిచిపోయిన ఎంఎంటీఎస్‌ సరీ్వసులను బుధవారం నుంచి పాక్షికంగా నడుపనున్నారు. దీంతో గతేడాది రైళ్ల రద్దు కారణంగా చాలామంది ప్రయాణికులు తమ సీజనల్‌ టికెట్లను వినియోగించుకోలేకపోయారు. అలాంటి వారు నష్టపోయిన కాలాన్ని ప్రస్తుతం  సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ మేరకు సీజనల్‌ టికెట్ల గడువును పొడిగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. సీజనల్‌ టికెట్‌ ప్రయాణికులు బుధవారం నుంచి ఈ పొడిగింపు సేవలను పొందవచ్చు.

అంటే సీజనల్‌ టికెట్‌  మిగిలిన రోజులను ఇప్పుడు వినియోగించుకోవచ్చు. మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా బుక్‌ చేసుకున్నా, కౌంటర్‌ నుంచి కొనుగోలు చేసిన టికెట్లయినా ఈ  సదుపాయం లభిస్తుంది. ప్రయాణికులు తమ సీజనల్‌ టికెట్‌ పొడిగింపునకు ఎమ్‌ఎమ్‌టీఎస్‌/సబర్బన్‌ స్టేషన్లలోని బుకింగ్‌ కౌంటర్ల వద్ద సంప్రదించాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ సూచించారు. 

యూటీఎస్‌ను వినియోగించుకోండి... 
► ఎంఎంటీఎస్‌ ప్రయాణానికి బుకింగ్‌ కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేయడమే కాకుండా నగదు రహితంగా టికెట్లను పొందవచ్చు.  
► అన్ని ఎంఎంటీఎస్‌ స్టేషన్‌లలో అందుబాటులో ఉన్న అటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మిషన్‌లలో స్మార్ట్‌ కార్డుల ద్వారా టికెట్లను పొందవచ్చు. ఈ టిక్కెట్‌లపైన 3 శాతం బోనస్‌ లభిస్తుంది.  
► ఈ  మేరకు తమ పాత స్మార్ట్‌ కార్డులను పునరుద్ధరించుకొనేందుకు ఎంఎంటీఎస్‌ స్టేషన్‌లలో సంప్రదించవచ్చు. 
► అలాగే అన్‌ రిజర్వుడ్‌ టికెటింగ్‌ సిస్టం (యూటీఎస్‌) మొబైల్‌ యాప్‌ వినియోగించే వారు కూడా ఎంఎంటీఎస్‌ టికెట్లను పొంద వచ్చు. యూటీఎస్‌ నుంచి టిక్కెట్‌లు తీసుకొనేవారికి  5 శాతం బోనస్‌  లభిస్తుంది. 
► కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఎంఎంటీఎస్‌ సేవలను వినియోగించుకోవాలని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా కోరారు.  

చదవండి: ‘కాళేశ్వర ఫలం’: 2.70 లక్షల ఎకరాలకు తొలి తడి

మరిన్ని వార్తలు