గ్రేటర్‌.. వరదలో మునిగిన కారు

5 Dec, 2020 10:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి వరద దెబ్బ గట్టిగానే తగిలింది. విశ్వనగరం వైపు నగరాన్ని పరుగులు పెట్టిస్తున్నామని...‘మాది మాటలు కాదు చేతల ప్రభుత్వమని చెప్పిన టీఆర్‌ఎస్‌... అందుకు నిదర్శనమే ఫ్లైఓవర్లు, రహదారులు, కేబుల్‌ బ్రిడ్జ్, స్కైవేల నిర్మాణమని ఢంకా బజాయించింది. అయితే అనుకోకుండా భాగ్యనగరాన్ని ప్రకృతి విలయం చుట్టుముట్టి కాలనీలు, బస్తీల్లోకి వరదలు వచ్చినా... అవి తాత్కాలిక ఇబ్బందులేనని, ప్రజలు తమవైపే ఉంటారని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో వేసుకున్న అంచనాలను ఓటరు తలకిందులు చేశాడు. ముఖ్యంగా ఈ ఏడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులకు అందిస్తామన్న వరద సహాయం చేతికి అందకపోవడం ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపింది. ఎల్‌బీ నగర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్, శేర్‌లింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లతో పాటు ఇతర నియోజకవర్గాల్లోని పలు కాలనీలు, బస్తీలు నీట మునిగాయి.

అయితే ఆయా ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలు  పర్యటించిన సందర్భంలోనూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో వరదల్లో చిక్కుకొని నష్టపోయిన వారికి రూ.10వేల ఆర్థిక సహాయమంటూ ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6.50 లక్షల మందికి రూ.650 కోట్లు పంపిణీ చేసింది. మరో 2.50 లక్షల మందికి ఇంకా వరద సహాయం అందిస్తామని నేతలు ఎన్నికల ప్రచారం చేసినా ప్రకటించినా ప్రజలు మాత్రం ఆదరించలేదు. మరోవైపు వరద సహాయం పంపిణీలోనూ  కార్పొరేటర్లు డబ్బులు నొక్కారంటూ ఆరోపణలు రావడం కూడా ఆ పార్టీకి నష్టదాయకంగా మారిందనే ఈ ఫలితాల ద్వారా తేటతెల్లమైంది. దీనికితోడు బీజేపీని గెలిపిస్తే బాధితులకు రూ.25వేల వరద సహాయం అందిస్తామని ప్రకటించడం ఆయా అభ్యర్థుల విజయానికి దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా మటుకు వరదలు వచ్చిన ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేయడం విశేషం.  

హోంమంత్రి ఇలాకాలో కారు పంక్చర్‌ 
హోంమంత్రి  మహమూద్‌ అలీ ఇలాకా అయిన మలక్‌పేట నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉండగా 5 ఎంఐఎం గెలుచుకోగా, 2 బీజేపీ కైవసం చేసుకున్నాయి. గతంలో ముసారాంబాగ్, సైదాబాద్‌ డివిజన్లను టీఆర్‌ఎస్‌ గెలుచుకోగా ఇప్పుడు ఆ రెండు డివిజన్లలో బీజేపీ గెలుపొందడం పార్టీకి కోలుకోలేని దెబ్బని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. హోంమంత్రి, నియోజకవర్గ ఇంచార్జి, డివిజన్‌ల అధ్యక్షులు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసినప్పటికీ ఫ్రెండ్లీ కంటెస్ట్‌తో ఇతర పార్టీల నాయకులతో ప్రచారం చేయవద్దని ఒత్తిడి రావడంతో హోంమంత్రి తూతూ మంత్రంగా ప్రచారం చేశారు. ఫ్రెండ్లీ కంటెస్ట్‌ లేకపోతే కనీసం మూసారాంబాగ్, సైదాబాద్, అక్బర్‌బాగ్, ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్లను గెలిచేవారమని పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మలక్‌పేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ను గ్రేటర్‌ ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీశాయని చెప్పాలి.  

మరిన్ని వార్తలు