కానిస్టేబుళ్లకు కమిషనర్‌ సెల్యూట్‌! 

16 Oct, 2020 08:59 IST|Sakshi

రెస్క్యూ ఆపరేషన్స్‌లో వారిదే కీలక పాత్ర 

‘సాక్షి’ ఇంటర్వూ్యలో కొత్వాల్‌ అంజనీకుమార్‌  

సాక్షి, సిటీబ్యూరో: ‘నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న కానిస్టేబుళ్లకు సెల్యూట్‌ చేస్తున్నాం. వరదలతో నీట మునిగిన ప్రాంతాల్లో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్స్‌లో వారిదే కీలక పాత్ర’ సీపీ అంజనీకుమార్‌ వ్యాఖ్యానించారు.  ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు.
(చదవండి: బీదర్‌ నుంచి వస్తున్న ‘రాణి’)
ఈత రాకున్నా రంగంలోకి.. 
► గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలమైంది. పాతబస్తీ, బోయిన్‌పల్లితో పాటు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.  
► ఇళ్లల్లోకి హఠాత్తుగా నీరు చేయడంతో పలువురు వాటిలోనే చిక్కుకున్నారు. అలాంటి వారిని రెస్క్యూ చేయడానికి నగర పోలీసు విభాగం తీవ్రంగా శ్రమించింది. 
► దాదాపు 300 మంది సిబ్బంది, అధికారుల ఇళ్లల్లోకి నీరు చేరింది. అయినప్పటికీ వారంతా నిర్విరామంగా విధులకే అంకితమయ్యారు. అంబర్‌పేటలోని నా ఇంటి వరండాలోకీ 3 అంగుళాల మేర నీరు వచ్చింది.  

సిబ్బందిలో స్ఫూర్తి కోసం అధికారులు.. 
► గురువారం నాటికి అనేక ప్రాంతాల్లో వరద తగ్గినా.. బురద ఉండటంతో సాధారణ స్థితులు నెలకొనలేదు. గడచిన నాలుగు రోజుల్లో పోలీసు విభాగం మొత్తం 200 మందిని వరద నీరు, మునక ప్రాంతాల నుంచి బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.  
► బుధవారం రాత్రి కురిసిన వర్షంతో కొన్ని చోట్ల నీరు నిలిచినా ఆ తర్వాత ఖాళీ అయింది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ అధికారులు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు.  

ఆ రెండూ సిటీకి లైఫ్‌లైన్‌.. 
భారీ వర్షం కారణంగా నీటి ఇన్‌ఫ్లో పెరిగి హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తడంతో మూసీలో ప్రవాహం పెరిగింది. ఫలితంగా ఎంజీబీఎస్‌ వంతెన పై నుంచి నీరు వెళ్లగా.. గురువారం తెల్లవారుజాము వరకు చాదర్‌ఘాట్‌ కింది వంతెన, అంబర్‌పేట కాజ్‌వే పూర్తిగా మునిగిపోయాయి.  
► సిటీకి లైఫ్‌లైన్‌ అయిన ఇవి కొట్టుకుపోయాయనే ప్రచారమూ జరిగింది. గురువారం ఉదయం ఆ రెండూ బయటపడటం, సురక్షితంగా ఉంటడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం.  
► ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీసులకు ప్రజలు అందించిన సహకారం మరువలేం. మరో రెండు రోజులు నగర పోలీసు విభాగం అప్రమత్తంగానే ఉంటుంది. గడచిన రెండు రోజుల్లో దాదాపు 200 మంది ఫోన్లు చేశారు. 
► ఫలానా కానిస్టేబుల్‌ మా కోసం చాలా కష్టపడ్డాడు అంటూ సిబ్బంది పేర్లతో సహా చెబుతున్నారు. ఇలాంటి ప్రోత్సాహం లభించినప్పుడు మా కష్టమంతా మరిచిపోతాం.  
(చదవండి: రూ.5 వేల కోట్ల నష్టం..)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు