Zomato-Swiggy: లీటర్‌​ పెట్రోల్‌ రూ.112... భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్‌!

27 Oct, 2021 11:06 IST|Sakshi

క్యాబ్‌ ఛార్జీలు పైపైకి

పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంతో చార్జీలకు రెక్కలు

బైక్‌ ట్యాక్సీలు, క్యాబ్‌ చార్జీల్లో 15 శాతం పెంపు

యాప్‌ ఆధారిత సర్వీసులపైనా తీవ్ర ప్రభావం 

సాక్షి, హైదరాబాద్‌: క్యాబ్‌లు, ట్యాక్సీబైక్‌లు, జొమాటో, స్విగ్గీ తదితర యాప్‌ ఆధారిత సేవల చార్జీలపై పెట్రోల్, డీజిల్‌ ధరలు ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పటికే  సర్‌ చార్జీలు, పీక్‌ అవర్స్‌ పేరిట  ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న క్యాబ్‌లు.. పెరిగిన పెట్రోల్, డీజిల్‌  ధరల భారాన్ని సైతం ప్రయాణికులపైనే మోపుతున్నాయి. అన్ని రకాల క్యాబ్‌లు, బైక్‌ల సేవలపై తాజాగా 15 శాతానికి పైగా చార్జీలను పెంచేశారు. దీంతో సిటీజనుల ప్రయాణం మరింత భారంగా పరిణమించింది. మరోవైపు యాప్‌ ఆధారంగా ఆహార పదార్థాలు, వివిధ రకాల వస్తువులను అందజేసే యాప్‌ ఆధారిత సేవలపై సైతం చార్జీలను పెంచేశారు.
చదవండి: స్విగ్గీ చేసింది.. ఆమెకు అండగా... ఆరోజులలో సెలవు!

ప్రతి రోజు వేలాది మంది ఎంతో ఇష్టంగా ఆర్డర్‌ ఇచ్చే బిర్యానీలు, రకరకాల ఫుడ్‌ ఐటెమ్స్‌పై రవాణా సేవల రూపంలో ఇప్పుడు మరికొంత అదనంగా చెల్లించుకోవాల్సివస్తోంది. నిత్యావసర వస్తువులను, సేవలను అందజేసే యాప్‌ ప్లాట్‌ఫామ్స్‌ కూడా ఇప్పుడు తమ రేట్‌ కార్డులను సవరించాయి. ‘గతంలో ఒకటిన్నర కిలోమీటర్‌ దూరానికి రూ.20 మాత్రమే సర్వీసు చార్జీ తీసుకుంటే ఇప్పుడు కొన్ని యాప్‌ ప్లాట్‌ఫామ్స్‌ రూ.25 నుంచి రూ.30 వరకు చార్జీలు వేస్తున్నాయి’ అని వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్‌ చార్జీల పెంపుతోనే సర్వీస్‌ చార్జీలు పెరిగాయని డెలివరీ బాయ్స్‌ చెబుతున్నారు. 
చదవండి: డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై ఊడిపడిన ఫ్యాన్‌.. హెల్మెట్‌ డాక్టర్స్‌!
  
బైక్‌ బెంబేలు... 
► సింగిల్‌ ప్యాసింజర్‌కు ఎంతో అనుకూలంగా ఉన్న బైక్‌ ట్యాక్సీలకు  కూడా ఇప్పుడు రెక్కలొచ్చేశాయి. హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌ నుంచి కొండాపూర్‌ వరకు గతంలో కేవలం రూ.21 నుంచి రూ.25 వరకు ఉన్న చార్జీ  ఇప్పుడు రూ.35 దాటింది. పైగా రోజు రోజుకు ఈ చార్జీల్లో  తేడాలు కనిపిస్తున్నాయి.

► సికింద్రాబాద్‌ నుంచి హబ్సిగూడ వరకు గతంలో రూ.30 వరకు చార్జీ ఉండగా ఇప్పుడు కొన్ని బైక్‌ ట్యాక్సీల్లో రూ.50 వరకు పెరిగింది. మరోవైపు క్యాబ్‌లు, ఆటోలు సైతం ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి.

► ఉప్పల్‌ నుంచి బంజారాహిల్స్‌ వరకు గతంలో రూ.275  ఉన్న క్యాబ్‌ చార్జీ ఇప్పుడు  రూ.350 దాటింది. పీక్‌ అవర్స్‌లో ఈ చార్జీలు మరింత  పెరుగుతున్నాయి.

►  దీంతో పాటు సర్‌చార్జీల రూపంలో  క్యాబ్‌ సంస్థలు మరింత  భారం మోపుతున్నాయి. ‘పెట్రోల్‌ మోతతో సొంత బండి పక్కన పెట్టి ట్యాక్సీ బైక్‌పై వెళ్దామనుకుంటే ఇప్పుడు ఆ చార్జీలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి’ అని  మల్కాజిగిరికి చెందిన ఫణీంద్ర విస్మయం వ్యక్తం చేశారు.  

సగటు జీవి విలవిల...  
► రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలు సగటు జీవిని  అతలాకుతలం చేస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.27, లీటర్‌ డీజిల్‌ రూ.105.46. 14.2 కిలోల  వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.952 దాటింది.

►  ఏ రోజుకా రోజు  పెరుగుతున్న ధరలతో  జనం విలవిల్లాడుతున్నారు. పెరిగిన  ఇంధన  ధరలతో కూరగాయలు, అన్ని రకాల కిరాణా సరుకులు, నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగాయి.

► కోవిడ్‌ కట్టడి కోసం  విధించిన లాక్‌డౌన్‌ దృష్ట్యా గతంలో  వివిధ రకాల వస్తుసేవల ధరలు  పెరిగాయి. కరోనా తగ్గుముఖం పట్టి, ఆంక్షల సంకెళ్లు  తొలగిపోయి కొద్దిగా ఊరట పొందుతున్న తరుణంలో సామాన్యుడి ముంగిట పేలిన పెట్రో బాంబు ఊపిరి తీసుకొనేందుకు అవకాశం లేకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

మరిన్ని వార్తలు