ఈ ఐటీ బాబులకు ఆదివారం సెలవు లేదు!

31 Jan, 2021 12:43 IST|Sakshi

రైతులకు బాసటగా నిలుస్తున్న టెకీలు 

రైతుల నుంచి కూరగాయలు తెచ్చి నగరంలో విక్రయం 

రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తున్న యువత 

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): పత్రికల్లో, టీవీల్లో రైతుల బాధలను నిత్యం చూస్తుంటాం. కానీ అయ్యో అని నిట్టూర్చకుండా హైదరాబాద్‌లోని కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు తమ వంతు సాయం చేయాలని భావించారు. రైతుల నుంచి కూరగాయలు తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మి, వచ్చిన డబ్బులను వారికే ఇస్తున్నారు. ఇందుకోసం 250 మంది సభ్యులుగా ఉన్న ఫోరం ఆఫ్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ (ఫర్‌ ఐటీ) రైతులకు అండగా ఉంటోంది. 2007లో ఏర్పడిన ఈ ఫర్‌ఐటీ.. తొలుత ఐటీ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసేది. ఆ తర్వాత సామాజిక బాధ్యత వైపు అడుగులు వేసింది. తాజాగా టమాటా రైతులకు గిట్టుబాటు ధర రాక.. కిలో టమాటా రెండు రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోందని తెలుసుకున్న ఈ బృందం.. నల్లగొండలోని రైతులకు సాయం చేయాలని భావించింది.

ఇందుకోసం రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసి కూరగాయలు విక్రయిస్తున్నారు. వచ్చిన డబ్బులో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం డబ్బును రైతులకే అందజేస్తున్నారు. హైదరాబాద్‌లో 9 చోట్ల రైతు బజార్లు ఏర్పాటు చేసి కిలో టమాటాను రూ.15కు విక్రయిస్తున్నారు. ఇలా రెండు రూపాయలకే అమ్ముకునే రైతుకు ఏకంగా రూ.15 వచ్చేలా చేస్తున్నారు. టమాటా మాత్రమే కాకుండా నిమ్మకాయలు, పుచ్చకాయలు, సోరకాయలు, ఆకు కూరలు కూడా తెచ్చి అత్తాపూర్, మియాపూర్, గచ్చిబౌలీ, అలకాపురి కాలనీ, జేఎన్టీయూ, బీహెచ్‌ఈఎల్, రాజేంద్రనగర్, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో విక్రయించి రైతులకు బాసటగా నిలవడమే కాకుండా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

వీరి ప్రోత్సాహం మరవలేనిది
నేను 6 ఎకరాల్లో టమాటా పంట వేశాను. గిట్టుబాటు లేకుండా పోయింది. ఆ సమయంలోనే హైదరాబాద్‌ నుంచి 30 మంది యువకులు వచ్చి నా టమాటాలను లారీల్లో తీసుకెళ్లి హైదరాబాద్‌లో కిలో రూ.15కు అమ్మి పెట్టారు. నాలాగే ఇంకా కొందరు రైతుల నుంచి కూడా కూరగాయలు తీసుకున్నారు. పైసా ఆదాయం లేకుండా రవాణా ఖర్చులు కూడా వారే భరించారు.       – నాగమణి, రైతు

 

మరిన్ని చోట్ల విక్రయిస్తాం
లాక్‌డౌన్‌లో మా సభ్యులకు వచ్చిన ఆలోచన ఇది. చాలా చోట్ల ఎక్కువ ధరకు టమాటాలు, కూరగాయలు విక్రయిస్తున్నారని తెలుసుకొని రైతులకు ఉపయోగపడేలా మేమే వెళ్లి కూరగాయలు తీసుకొచ్చాం. మేం తె చ్చిన తాజా కూరగాయలు అందరికీ నచ్చాయి. అందుకే కూరగాయల బ జార్లు ఏర్పాటు చేసిన నాలుగైదు గం టల్లోనే అమ్ముడుపోయేవి. రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల విక్రయిస్తాం. 
– కిరణ్‌ చంద్ర, ఫర్‌ ఐటీ సంస్థ అధ్యక్షుడు  

రవాణా ఖర్చులు మేమే భరిస్తాం
రైతుల నుంచి కూరగాయలు తీసుకొచ్చే క్రమంలో రవాణా ఖర్చులన్నీ మా సంస్థే భరించింది. గిట్టుబాటు ధరలేక రైతులు పడుతున్న ఇబ్బందులపై మేం చర్చించుకున్నాం. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం. నల్లగొండ జిల్లా హాలియా, కట్టంగూర్‌ తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి నేరుగా కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించాం. రైతుకు కూడా తగిన గిట్టుబాటు ధర లభించింది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తాం.     
    – ప్రవీణ్‌ చంద్రహాస్, జనరల్‌ సెక్రటరీ ఫర్‌ ఐటీ  

మరిన్ని వార్తలు