Scrub Typhus Cases In Hyderabad: చాపకింద నీరులా పాకుతున్న కొత్త వ్యాధి.. గాంధీ ఆస్పత్రిలో 15 కేసులు​

22 Dec, 2021 14:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణను ఇప్పటికే కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో భాగ్యనగర వాసులను మరో కొత్త రకం వ్యాధి పీడిస్తోంది. స్క్రబ్ టైఫస్ పేరుతో ఉన్న ఈ వ్యాధి బారిన పడిన బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉండడం గమనార్హం.  స్క్రబ్ టైఫస్ అనే పురుగులు ఈ వ్యాధికి కారణమవుతాయి. క్రమంగా దీని బాధితుల సంఖ్య కూడా పెరుగడం వైద్యులను కలవరపెడుతోంది.  ఇప్పటికే ఈ వ్యాధితో గాంధీ ఆస్పత్రిలో 15 మంది చికిత్స పొందుతున్నారు.  

ఈ నెలలో నలుగురు చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. అందులో ఇద్దరు కోలుకోగా, మిగిలిన ఇద్దరికి చికిత్స జరగుతోంది. అయితే, ఇటీవల దేశంలోని అనేక ప్రాంతాల్లో సబ్‌టైఫస్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. అక్కడ కూడా బాధితుల్లో అధికంగా చిన్నారులే ఉన్నారు. అసలే ఒమిక్రాన్‌తో హడలిపోతున్న నగర వాసులకు ఇప్పుడు  స్క్రబ్ టైఫస్ వైరస్‌కు తోడవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి?
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ( సీడీసీ) ప్రకారం, స్క్రబ్ టైఫస్ (ఓరియంటియా సుట్సుగముషి) అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. దీనిని బుష్ టైఫస్ అని కూడా పిలుస్తారు. ఇన్ఫెక్షన్ ఒక క్రిమి (లార్వా మైట్) కాటు ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తుంది.

స్క్రబ్ టైఫస్ లక్షణాలు..
దీని కాటు వల్ల.. తీవ్రమైన జ్వరం, చలి, తలనొప్పి, కళ్లు, కండరాల నొప్పులు, శరీర నొప్పులు, దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.  ఈ ప్రభావాలన్నీ కూడా 10 రోజులలోపు బయటపడతాయి. కనుక ఈ లక్షణాలు కనిపించిన తక్షణమే వైద్యులను సంప్రదించాలి.

చదవండి: Tamil Nadu: ట్రాన్స్‌జండర్‌గా మారుతానన్నందుకు కొడుకును హతమార్చిన తల్లి!

మరిన్ని వార్తలు