Hyderabad: భాగ్యనగర వాసులు చికెన్‌ లవర్స్‌ 

16 Dec, 2022 10:07 IST|Sakshi

వెరైటీ ఫుడ్‌ ఆర్డర్‌లో బెంగళూరు ప్రథమం

రెండో స్థానంలో నిలిచిన హైదరాబాద్‌

స్విగ్గీ తాజా నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌వాసులు చికెన్‌ లవర్స్‌ అని మరోసారి నిరూపించారు. ఈ విషయంలో గ్రీన్‌సిటీ బెంగళూరు తొలిస్థానంలో నిలవగా.. హైదరాబాద్‌ సిటీ రెండోస్థానంలో నిలిచింది. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ.. 2022 తాజా ఆహార ట్రెండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలను  వెల్లడించింది. చికెన్‌ వెరైటీ ఆర్డర్లు చేసే వారిలో చెన్నై మూడో స్థానంలో నిలిచిందట. ఆ తర్వాత స్థానాల్లో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పుణె, కోయంబత్తూర్‌ నిలిచినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఫుడ్‌ ఆర్డర్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే.. చికెన్‌ ఆర్డర్లు ఈ ఏడాది సుమారు 29.86 లక్షల మేర ఉండడం విశేషం. నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీకి వెల్లువెత్తుతున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు లక్షకుపైగా రెస్టారెంట్లు, క్లౌడ్‌ కిచెన్‌లు స్విగ్గీలో భాగస్వాములైనట్లు పేర్కొంది. 

వీటికి భలే డిమాండ్‌.
దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో ఫుడ్‌ ఆర్డర్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే.. పలు నోరూరించే ఆహార పదార్థాలకు గిరాకీ బాగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా చికెన్‌ బిర్యానీ, మసాలా దోశ, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్, పన్నీర్‌ బటర్‌ మసాలా, బటర్‌నాన్, వెజ్‌ ఫ్రైడ్‌ రైస్, వెజ్‌బిర్యానీ, తందూరీ చికెన్‌లు  అగ్రభాగంలో నిలిచాయి.

 విదేశీ వంటకాల్లో.. 
మెట్రో నగరవాసుల జిహ్వచాపల్యాన్ని సంతృప్తి పరిచిన విదేశీ వంటకాల్లో ఇటాలియన్‌ పాస్తా, పిజ్జా, మెక్సికన్‌ బౌల్, స్పైసీ రామెన్‌ అండ్‌ సుషి వంటకాలున్నాయి. 

వాహ్‌.. స్నాక్స్‌.. 
వినియోగదారుల మనసు దోచుకున్న స్నాక్స్‌లో సమోసా, పాప్‌కార్న్, పావ్‌భాజీ, ఫ్రెంచ్‌ ఫ్రైస్, గార్లిక్‌ బ్రెడ్‌స్టిక్స్, హాట్‌వింగ్స్, టాకో, క్లాసిక్‌ స్టఫ్డ్‌ గార్లిక్‌ బ్రెడ్, మింగిల్స్‌ బకెట్‌లున్నాయి. 

నోరూరించే డెజర్ట్‌లివే... 
స్విగ్గీ ఆర్డర్లలో అగ్రభాగాన ఉన్న ఐస్‌క్రీమ్‌/ మిఠాయిలలో గులాబ్‌ జామూన్, రస్‌మలాయ్, చాకోలావా కేక్, రస్‌గుల్లా, చాకోచిప్స్‌ ఐస్‌క్రీమ్, అల్పా న్సో మ్యాంగో ఐస్‌క్రీమ్, కాజూకాటిల్, టెండర్‌ కోకోనట్‌ ఐస్‌క్రీమ్, హాట్‌ చాక్లెట్‌ ఫడ్జ్‌లున్నాయి.

మరిన్ని వార్తలు