అర్థరాత్రి హైడ్రామా.. రాత్రి రాత్రే కొత్తపేట పండ్ల మార్కెట్‌ నేలమట్టం

9 Mar, 2022 17:03 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో/చైతన్యపురి: కొత్తపేట పండ్ల మార్కెట్‌ కాలగర్భంలో కలిసిపోయింది. 36 ఏళ్ల చరిత్ర కలిగిన మార్కెట్‌ రాత్రికి రాత్రే భూస్థాపితమైంది. పండ్ల మార్కెట్‌ స్థలంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించిన సర్కారు.. 21 ఎకరాల ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్యశాఖకు బదలాయించింది. దీంతో ఈ మార్కెట్‌ను బాటసింగారం తరలించాలని నిర్ణయించిన సర్కారు ఆగమేఘాల మీద జేసీబీలతో మంగళవారం తెల్లవారేసరికి మార్కెట్‌ను కూల్చేసింది. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన కమీషన్‌ ఏజెంట్లు హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సమర్పించడం.. న్యాయస్థానం కూడా ఈ వ్యవహారంలో మార్కెటింగ్‌ శాఖ అధికారుల తీరును తప్పుపట్టడం చకచకా జరిగిపోయాయి.  

ఏర్పాట్లు చేసేంతవరకు.. 
► కోహెడలో పూర్తిస్థాయిలో మార్కెట్‌ నిర్మించేంతవరకు తాత్కాలికంగా బాటసింగారానికి కొత్తపేట పండ్ల మార్కెట్‌ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ సౌకర్యాల కల్పన సరిగా లేకపోవడంతో ఈ వ్యవహారంపై కమీషన్‌ ఏజెంట్లు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారించిన న్యాయస్థానం అక్కడ పూర్తి ఏర్పాట్లు చేసేంతవరకు మార్కెట్‌ను కొత్తపేటలోనే కొనసాగించాలని స్పష్టం చేసింది.  
► ఈ నేపథ్యంలో ఈ నెల 4న కొత్తపేటలో పండ్ల మార్కెట్‌ను పునఃప్రారంభించారు. మార్కెట్‌ తరలింపు వ్యవహారం సర్కారుకు చికాకుగా మారింది. తడవకోసారి బాటసింగారం, అక్కడి నుంచి కొత్తపేటకు తరలించడం ద్వారా క్రయవిక్రయాలపై ప్రభావం పడుతుందని భావించిన ప్రభుత్వం.. ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయించినందున ఖాళీ చేయాలని నిర్ణయించింది. 

► ఈ క్రమంలోనే స్థలాన్ని స్వాధీనం చేసుకున్న వైద్య, ఆరోగ్యశాఖ షెడ్లను కూల్చివేసింది. మార్కెట్‌ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. మార్కెట్‌ మూసివేతకు అధికారులు రావడంతో వ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ మార్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌ను కూల్చివేస్తున్నారనే సమాచారంతో వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి వీరిని చెదరగొట్టారు. తెల్లవారేసరికి ఫ్రూట్‌ మార్కెట్‌ను నేలమట్టం చేశారు. 
►  కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మార్కెట్‌ను కూల్చివేశారని కమీషన్‌ ఏజెంట్లు ఆరోపిస్తు న్నారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు మాత్రం బాటసింగారంలోనే మార్కెట్‌ కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, అక్కడే పండ్ల మార్కెట్‌ కొనసాగుతుందని, మంగళవారం బాటసింగారంలోనే క్రయవిక్రయాలు జరిగా యని అధికారులు చెబుతుండటం గమనార్హం.
► మార్కెట్‌లో కూల్చివేతల విషయం తెలుసుకున్న ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మల్‌రెడ్డి రాంరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్‌ దర్పెల్లి రాజశేఖర్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి మార్కెట్‌ వ్యాపారులకు 
మద్దతుగా ఆందోళన చేపట్టారు.    

కూల్చివేతలు ఆపండి: హైకోర్టు 
సాక్షి, హైదరాబాద్‌: గడ్డిఅన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌ తరలింపు ప్రక్రియకు నెల రోజుల గడువు ఇవ్వాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా మార్కెట్‌లో కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యాపారులను మార్కెట్‌ ఆవరణలోకి అనుమతించాలని, తమ వస్తువులను బాటసింగారం మార్కెట్‌కు తరలించేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు వ్యవసాయ, మార్కెటింగ్‌ విభాగం డైరెక్టర్‌ లక్ష్మీబాయి, వ్యవసాయ, మార్కెటింగ్‌ విభాగం ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావులను హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ధర్మాసనం ఆదేశాలకు విరుద్దంగా మార్కెట్‌ను కూల్చివేస్తున్నారంటూ కమీషన్‌ ఏజెంట్లు దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. నెల రోజుల్లో ఖాళీ చేయాలని గత నెల 8న ధర్మాసనం ఆదేశించిందని, ఈ నెల 8 వరకు గడువు ఉన్నా...వ్యాపారులను ఈ నెల 4న మాత్రమే అనుమతించారని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది గంగయ్యనాయుడు వాదనలు వినిపించారు.

మార్కెట్‌లోకి ప్రవేశించిన వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేశారని, దాదాపు 500 మంది పోలీసుల పహారా మధ్య సోమవారం అర్ధరాత్రి కూల్చివేతలు చేస్తున్నారని తెలిపారు. 106 కమిషన్‌ ఏజెంట్లలో 78 మంది ఇప్పటికే బాటసింగారం మార్కెట్‌కు తరలి వెళ్లిపోయారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ నివేదించారు. దీంతో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితి కల్పించడం తీవ్ర దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.  

మరిన్ని వార్తలు