‘కృత్రిమ మేధస్సు’.. గుంతల రోడ్లకు తేజస్సు!

27 Aug, 2022 20:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)కు అవసరమైన ఆవిష్కరణలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థ క్యాప్‌ జెమినితో కలిసి తెలంగాణ ఇన్నోవేషన్‌ మిషన్‌(టీ ఎయిమ్‌) ‘మొబిలిటీ ఏఐ గ్రాండ్‌ చాలెంజ్‌’ను ప్రారంభించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రత్యక్ష, ఫైల్‌ వీడియోల ఆధారంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎంపిక చేసిన మార్గాల్లో రోడ్లపైనున్న గుంతలను గుర్తించి తీవ్రతను బట్టి వాటిని వర్గీకరించేలా పరిష్కారాన్ని ఈ చాలెంజ్‌లో ఆవిష్కరించాల్సి ఉంటుంది.

ఈ ఆవిష్కరణ ఆధారంగా జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్ల మరమ్మతులకు చర్యలు చేపడతారు. చాలెంజ్‌ పట్ల ఆసక్తి ఉన్న ఆవిష్కర్తల నుంచి దేశవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తుల పరిశీలన తర్వాత ఎంపికైన ఆవిష్కర్తలు నాలుగు వారాల్లోగా తమ ఆవిష్కరణలకు ఎలా కార్యరూపం ఇస్తారు, ఏ తరహా సాంకేతికను వినియోగిస్తారు, దాని ఫలితాలు ఎలా ఉంటాయనే అంశాలపై ఇచ్చే ప్రజెంటేషన్‌ ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. ఈ విధంగా ఎంపికైన విజేతకు జీహెచ్‌ఎంసీలో తమ పైలట్‌ ప్రాజెక్టును అమలు చేసేందుకు వీలుగా రూ.20 లక్షలు ప్రోత్సాహకంగా అందజేస్తారు.

ఈ చాలెంజ్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన టీహాన్, ఐ హబ్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అప్లైడ్‌ ఏఐ రీసెర్చ్‌ సెంటర్‌ భాగస్వాములుగా ఉంటాయి. సామాజిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు మొబిలిటీ గ్రాండ్‌ చాలెంజ్‌ వంటి వేదికల ద్వారా ప్రభుత్వాలతో ఆవిష్కర్తల భాగస్వామ్యం మరింత పెరగాల్సి ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వ్యాఖ్యానించారు. ఈ గ్రాండ్‌ చాలెంజ్‌ పట్ల ఆసక్తి ఉన్న ఆవిష్కర్తలు సెప్టెంబర్‌ 16లోగా https: //taim&gc.in/mobility  వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌ నెలాఖరులో మొబిలిటీ ఏఐ గ్రాండ్‌ చాలెంజ్‌ విజేతలను ప్రకటిస్తారు.  
చదవండి: టీఎస్ ఐసెట్‌ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ కోసం క్లిక్ చేయండి 

మరిన్ని వార్తలు