ఫోర్బ్స్‌ జాబితాలో తెలంగాణ ‘కీర్తి’ 

6 Feb, 2021 01:46 IST|Sakshi

30 ఏళ్లలోపు ప్రతిభాశీలుర జాబితాలో నిలిచిన మెదక్‌ ఎంపీ కూతురు కీర్తిరెడ్డి 

కోవిడ్‌ వ్యాక్సిన్‌ నిల్వపై కంపెనీ నిర్వహణ  

చిన్ననాటి నుంచే వినూత్న ఆలోచనలతో ముందుకు 

సాక్షి, దుబ్బాక‌: ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్‌ ప్రచురించే ప్రతిభాశీలుర జాబితాలో తెలంగాణకు చెందిన కీర్తిరెడ్డికి చోటు లభించింది.  30 ఏళ్ల లోపు ఉండి ఉన్నతంగా రాణిస్తున్న 30 మందితో ఫోర్బ్స్‌ పత్రిక ఈ జాబితాను ప్రచురిస్తుంటుంది. ఈసారి ఆ జాబితాలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం ముద్దుబిడ్డ కొత్త కీర్తిరెడ్డి నిలిచారు. 24 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన కీర్తిరెడ్డి మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూతురు. చిన్ననాటి నుంచే వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లే కీర్తిరెడ్డి.. కరోనా వ్యాక్సిన్‌ నిల్వకు సంబంధించిన కంపెనీని నిర్వహిస్తున్నారు. తాజాగా ఫోర్బ్స్‌ పత్రిక ప్రతినిధులు హైదరాబాద్‌లోని ఆమె కంపెనీని పరిశీలించి ఈ విషయంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా 30 ఏళ్లలోపు అత్యంత ప్రతిభాశీలుర జాబితాలో చోటు కల్పించారు. 

చిన్ననాటి నుంచే చురుగ్గా.. 
కీర్తిరెడ్డి చిన్ననాటి నుంచే చురుకైన విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పదో తరగతి వరకు హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్, ఇంటర్‌ చిరెక్‌ కళాశాలలో చదివింది. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాల నుంచి బీబీఎం పట్టా పొందారు. అలాగే ఆమె ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ మేనేజ్‌మెంట్‌’లో గ్లోబల్‌ మాస్టర్‌ పట్టాను పొందారు. ప్రస్తుతం ఆమె స్టాట్విగ్‌ అనే బ్లాక్‌ చైన్‌ సాంకేతికత ఆధారిత వ్యాక్సిన్‌ సరఫరా నిర్వహణ ఫ్లాట్‌ ఫాం కంపెనీకి సహ వ్యవస్థాపకురాలు (సీఓఓ)గా వ్యవహరిస్తున్నారు. వ్యాక్సిన్లు, ఆహారం వృథాను అరికట్టేందుకు అవసరమైన వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. 

పలువురి ప్రశంసలు 
స్వతహాగా ఏదైనా కంపెనీని స్థాపించాలన్న ఆలోచనతో ఆమె హైదరాబాద్‌లో స్టాట్విగ్‌ అనే వ్యాక్సిన్‌ సరఫరా, నిర్వహణ ఫ్లాట్‌ ఫాం కంపెనీని ఏర్పాటు చేశారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ఎలా నిల్వ చేయాలి.. ఎంత ఉష్ణోగ్రతల్లో ఉంచాలి.. నాణ్యతా ప్రమాణాలు, నిర్దేశిత ప్రదేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన అంశాల్లో ఆమె ప్రతిభను ఫోర్బ్స్‌ పత్రిక గుర్తించింది. కాగా, తన కూతురు ప్రఖ్యాత ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన అత్యంత ప్రతిభాశీలుర జాబితాలో నిలవడం సంతోషంగా ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు కీర్తిరెడ్డిని అభినందించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు