ఆర్‌ఆర్‌ఆర్‌పై అన్నిటికీ రైట్‌.. రైట్‌

12 Feb, 2022 06:49 IST|Sakshi

రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై రాకపోకలకు అనుమతి!

నాలుగు వరసల ఎక్స్‌ప్రెస్‌ వే అయినా ఆటోలూ, టూ వీలర్లు కూడా వెళ్లొచ్చు

రోడ్డు అంచున ఉండే ప్రత్యేక భాగంలో రాకపోకలకు అవకాశం!

సర్వీసు రోడ్లు లేకపోవడం వల్లే..

ఖర్చు నియంత్రణ కోసం ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)పై వెళ్లేందుకు అన్ని వాహ నాలకు అనుమతి ఇవ్వబోతున్నారు. ఎక్స్‌ ప్రెస్‌వే అయినప్పటికీ బస్సులు, కార్లే కాకుండా ఆటోలు, ద్విచక్రవాహనాలు, చివరకు ఎడ్ల బండ్లు సైతం దీని మీదుగా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగురోడ్డు, అలాగే విమానాశ్రయానికి ప్రత్యేకంగా నగరం నుంచి శంషాబాద్‌ వరకు నిర్మించిన పీవీ నరసింహారావు ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేల మీద ద్విచక్రవాహనాలు, ఆటోలు లాంటి చిన్న వాహనాలకు అనుమతి లేని విషయం తెలిసిందే.ఈ రెండింటి లాగే ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా ఎక్స్‌ప్రెస్‌ వేగా నాలుగు వరుసల్లో రూపుదిద్దుకోనున్నప్పటికీ అన్ని వాహనాలూ వెళ్లేందుకు అనుమతించనున్నారు. 

సర్వీసు రోడ్లు ఉండవు..
సాధారణంగా ఎక్స్‌ప్రెస్‌ వేలకు సర్వీసు రోడ్లను నిర్మిస్తారు. ఇప్పుడు నిర్మించే ప్రధాన జాతీయ రహదారులకు కూడా సర్వీసు రోడ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పీవీ ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్‌ (ఎలివేటెడ్‌ కారిడార్‌)గా నిర్మించినందున దానికి సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయలేదు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌కు కూడా సర్వీసు రోడ్డు ఉండదని తెలుస్తోంది. దీన్ని జాతీయ రహదారిగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

దాదాపు 335 కి.మీ. నిడివితో కూడిన ఈ రోడ్డుకు దాదాపు రూ.18 వేల కోట్లకుపైగా ఖర్చు కానుంది. కాగా దీని నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదట్నుంచీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోడ్డును 8 వరుసలుగా నిర్మించాల్సి ఉన్నా, ప్రస్తుతానికి 4 వరుసలు సరిపోతాయని ఇప్పటికే నిర్ధారించారు. తాజాగా దీని వ్యయంపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో చర్చించారు. ప్రస్తుతానికి ఉత్తర భాగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్న నేపథ్యంలో..  వీలైనంత వరకు ఖర్చును నియంత్రణలో ఉంచుకోవాలని ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ  అధికారులు నిర్ణయించారు.

ఇందులో భాగంగానే సర్వీసు రోడ్ల ప్రతిపాదన తొలగించారు. అయితే సర్వీసు రోడ్లు లేకుంటే స్థానికులు ఎక్కువగా వినియోగించే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు లాంటివి ఎక్స్‌ప్రెవే పైకి ఎక్కేందుకు వీలుండదు. అలాంటప్పుడు స్థానికులు భూములు ఇచ్చేందుకు అంగీకరించరు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎక్స్‌ప్రెస్‌ వే అయినప్పటికీ, సాధారణ జాతీయ రహదారుల మీదకు అన్ని వాహనాలను అనుమతిస్తున్నట్టే దీని మీదకు కూడా అనుతించటం ద్వారా సర్వీసు రోడ్ల అవసరం లేకుండా చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఈ నేపథ్యంలో రెండు వైపులా ప్రధాన క్యారేజ్‌ వేకు చివరన (అంచున) 3 మీటర్ల వెడల్పుతో కాస్త పల్లంగా రోడ్డు (పేవ్డ్‌ షోల్డర్‌ పోర్షన్‌) నిర్మిస్తారు. ఇది ప్రధాన రోడ్డుకు చివరలో ఉండే తెల్ల గీతకు అవతల ఉంటుందన్న మాట.

రోడ్డు అంచుల్లో చిన్న వాహనాలు
రీజినల్‌ రింగ్‌రోడ్డును 120 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకుపోగలిగే సామర్థ్యంతో, ప్రమాణాలతో నిర్మిస్తారు. అంత వేగంగా వాహనాలు దూసుకుపోతుంటే ద్విచక్ర వాహనాలు, ఆటోల లాంటి తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాల కారణంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే సర్వీసు రోడ్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌కు సర్వీసు రోడ్డు అవసరం లేదని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తుండటంపై కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది.

అయితే ఈ రోడ్డు చివరన ఉండే పేవ్డ్‌ షోల్డర్స్‌ పోర్షన్‌ను ఇలా తక్కువ వేగంతో వెళ్లే ఆటోలు, ద్విచక్ర వాహనాలు లాంటి వాటికి కేటాయిస్తారు. అయితే సర్వీసు రోడ్డు ఉంటేనే బాగుంటుందని స్థానిక అధికారులు కోరుతున్నట్టు సమాచారం. వీలుకాని పక్షంలో కనీసం ఒక్క వైపైనా సర్వీసు రోడ్డు నిర్మించేలా డిజైన్‌ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు