మూడేళ్లైంది.. మాటిచ్చి మరచిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

21 Mar, 2022 09:00 IST|Sakshi
ఏకగ్రీవమైన నాగిశెట్టిపల్లి పంచాయతీ కార్యాలయం

ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.10లక్షల నజరానా 

నిధుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న పాలకవర్గాలు 

మూడేళ్లయినా నజరానా అందకపోవడంతో సర్వత్రా విమర్శలు  

ఎన్నికల ఖర్చు తగ్గించేందుకు ప్రభుత్వం ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు నజరానా ఇస్తామని ప్రభుత్వం మాటిచ్చింది. గత సర్పంచ్‌ ఎన్నికల్లో రూ.10లక్షలు ఇస్తామని హామీ ఇవ్వడంతో మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో తొమ్మిది గ్రామ పంచాయతీలు ఏకగ్రీమయ్యాయి. కట్‌ చేస్తే ప్రభుత్వ మాటలు, హామీలు ఒట్టి మాటలేనని ఆయా గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. మూడేళ్లయినా రూ.10లక్షల నిధులు ఇవ్వకపోవడం గమనార్హం. ప్రభుత్వం ‘ఒట్టి మాటలు కట్టిపెట్టి పంచాయతీలకు తోడు పడాలి’అని పాలకవర్గాలు కోరుతున్నారు.

సాక్షి,ఘట్‌కేసర్‌(హైదరాబాద్‌): జిల్లాలో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై మూడేళ్లవుతోంది. నజరానా నిధులు కోసం పాలకవర్గాలు వెయ్యి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిధులు కేటాయిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనుకున్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. నిధుల కొరతతో ఏకగ్రీవ పంచాయతీల్లో చిన్న చిన్న పనులు కూడా చేపట్టలేని దుస్థితి నెలకొంది.  (చదవండి: ట్రాఫిక్‌ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే )
61 పంచాయతీల్లో 9 ఏకగ్రీవం.. 
►   జిల్లాలో 61 పంచాయతీలు ఉన్నాయి. అందులో 9 ఏకగ్రీవం అయ్యాయి. మంత్రులు తలో మాట అంటుండటంతో ఏకగ్రీవమైన పంచాయతీలకు నిధులు వస్తాయో రావోనని పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 
ఏకగ్రీవమైన పంచాయతీలు.. 
►    ఘట్‌కేసర్‌ మండలంలో మాదారం, శామీర్‌పేట్‌ మండలంలో యాడారం, నాగిశెట్టిపల్లి, మూడుచింతలపల్లి మండలంలో మూడుచింతలపల్లి, కీసర మండలంలో నర్సంపల్లి, మేడ్చల్‌ మండలంలో డబీల్‌పూర్, లింగాపూర్, రాజబొల్లారం తండా, రాయిలాపూర్‌ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 
అభివృద్ధి చేయొచ్చని ఏకగ్రీవం.. 
►    అనుబంధ గ్రామాలుగా ఉన్న సమయంలో అరకొర నిధుల కేటాయింపుతో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని.. ఒక మాటగా నిలచి ఏకగ్రీవం చేసుకుంటే వచ్చే నిధులుతో గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చని భావించారు. 
పాలకవర్గాల ఆశలు ఆవిరి.. 
►   ఏకగ్రీవమైన చాలా పంచాయతీలు అనుబంధ గ్రామాలుగా ఉండి నూతనంగా ఏర్పడినవే. చిన్న పంచాయతీలు కావడం.. ఓటర్లు తక్కువగా ఉండడంతో గ్రామాభివృద్ధి కోసం రాజకీయాలను పక్కనపెట్టి సమష్టి నిర్ణయంతో పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఏకగ్రీవ నిధులు ఇస్తామన్న సర్కారు మాట తప్పడంతో పాలకవర్గాల ఆశలు ఆవిరయ్యాయనే చెప్పాలి. 
ఆదాయ మార్గాలు లేక అభివృద్ధికి దూరం.. 
►    జనాభా ఆధారంగా ఆర్థిక సంఘం ఇచ్చే నిధుల కేటాయింపుతో ప్రయోజనం కలగడం లేదు. ప్రస్తుతం వస్తున్న నిధుల నుంచి ట్రాక్టర్‌ ఈఎంఐ, విద్యుత్, డీజిల్‌ బిల్లులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, ఇతర బిల్లులను ఏకగ్రీవ పంచాయతీలు చెల్లించకలేపోతున్నాయి. ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఈ పంచాయతీలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. సర్కారు ఇచ్చిన హామీ ప్రకారం ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులు విడుదల చేయాలని వేడుకుంటున్నారు. 

అభివృద్ధికి సహకరించాలి... 
ఇచ్చిన హామీ ప్రకారం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షల నజరానా ఇవ్వాలి. చిన్న గ్రామం కావడంతో అభివృద్ది పనులు చేపట్టలేకపోతున్నాం. హామీని నిలబెట్టుకొని అభివృద్ధికి సహకరించాలి.  
  – యాదగిరి, మాదారం సర్పంచ్, ఘట్‌కేసర్‌ మండలం

ప్రభుత్వ పెద్దలవి తలో మాట.. 
ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.10లక్షలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. హామీలిచ్చి అమలు చేయకపోవడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉంది. హామీపై ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తలో మాట మాట్లాడటంసిగ్గుచేటు.
– ప్రవీణ్‌రావు, ఘట్‌కేసర్‌ మండల బీజేపీ  అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు