మహిళా దినోత్సవం: ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ సర్కార్‌ శ్రీకారం

4 Mar, 2023 19:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు బిఆర్కే భవన్‌లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం "ఆరోగ్య మహిళ" కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం, ఈ నెల 8న ప్రారంభించే అరోగ్య మహిళ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.

మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం సీఎం సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిందని, మహిళలు ప్రధానంగా ఎదుర్కునే 8 రకాల ఆరోగ్య సమస్యలకి ఈ వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మంగళవారం మహిళల కోసం  ప్రత్యేక వైద్య సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో, మొత్తం 1200 లకు విస్తరించాలని ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు.

8 వైద్య సేవలు
1, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు
2, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్.. 
3, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.
4, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.
5, మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్ తో అవగాహన కలిగిస్తారు.
6, నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
7. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.
8. సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. 

ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి,సీఎం ఓఎస్డీ గంగాధర్, డైరెక్టర్ పిఆర్ హన్మంత రావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు