పేదలకు అత్యాధునిక వైద్యం: మంత్రి హరీశ్‌

25 Apr, 2022 02:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/రసూల్‌పురా: ఎయిమ్స్‌ తరహాలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)పేరిట నగరం నలుదిక్కులా ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఆసుపత్రుల్లో మూడింటికి సీఎం కేసీఆర్‌ మంగళవారం భూమి పూజ చేయనున్నారు. బొల్లారం, ఎల్బీనగర్, సనత్‌నగర్‌లలో రూ.2,679 కోట్ల వ్యయంతో ప్రభుత్వం వీటిని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బొల్లారంలో ఆసుపత్రి నిర్మించనున్న స్థలంతోపాటు, సభాస్థలి ఏర్పాట్లను ఆదివారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పరిశీలించారు. పేదలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు చేపడుతున్న మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని హరీశ్‌రావు చెప్పారు. వీటితో సూపర్‌ స్పెషాలిటీ వైద్య విద్య కూడా మరింత బలోపేతమవుతుందన్నారు. రూ.897 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బొల్లారం ఆసుపత్రితో మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, కంటోన్మెంట్‌ ప్రజలకు సకాలంలో అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయన్నారు. 

మరిన్ని వార్తలు