Hyderabad: డేంజర్‌ బెల్స్‌.. భారీగా డెంగీ కేసులు

27 Jul, 2021 17:21 IST|Sakshi

గత ఏడాదితో పోలిస్తే భారీగా డెంగీ కేసులు నమోదు

సంపన్నులు నివసించే ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు

జిల్లా వైద్యాధికారులకు చేరని బాధితుల సమాచారం

కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో గుట్టుగా చికిత్సలు.. 

ప్లేట్‌లెట్స్‌ కౌంట్స్‌ పేరుతో భారీగా బిల్లులు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ భయంతో గత ఏడాది బస్తీల్లో విధిగా హైడ్రోక్లోరైడ్‌తో శానిటైజ్‌ చేయడం, ఫాగింగ్‌ నిర్వహించడం వల్ల దోమలు పెద్దగా లేకుండా పోయాయి. ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే.. సెకండ్‌ వేవ్‌లో కోవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆయా చర్యలు చేపట్టలేదు. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి చుట్టూ ఒకవైపు వరద.. మరోవైపు బురద పేరుకు పోయి డెంగీ దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి. గ్రేటర్‌లో 2019లో అత్యధికంగా 3366 డెంగీ కేసులు నమోదైతే.. అదే 2020లో కేసుల సంఖ్య 346 తగ్గిపోయింది. తాజాగా ఈ ఏడాది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో అధికారికంగా ఇప్పటికే 250 కేసులు నమోదు కాగా అనధికారికంగా ఒక్కో కార్పొరేట్‌ ఆస్పత్రిలో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సంపన్నులు ఎక్కువగా నివసించే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, శేర్‌లింగంపల్లి, నానాక్‌రామ్‌గూడ, కూకట్‌పల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుండటం గమనార్హం.        

గుట్టుగా చికిత్సలు 
ఇప్పటికే కరోనా వైరస్‌ సిటిజన్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా.. తాజాగా డెంగీ దోమలు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు తోడు ఇంటి చుట్టు వరద నీరు చేరి దోమలకు నిలయాలుగా మారాయి. – నిల్వ ఉన్న ఈ నీటిగుంతల్లో దోమలు గుడ్లు పెట్టి వాటి సంతతిని మరింత పెంచి పోషిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎప్పటికప్పడు దోమల నియంత్రణ కోసం యాంటిలార్వ, ఫాగింగ్‌ నిర్వహించకపోవడమే ఇందుకు కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా దోమలు దాడి చేస్తుండటంతో ఇటీవల బాధితులు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు.

మనిషి రక్తంలో ప్లేట్‌లెట్స్‌ 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. డెంగీ జ్వరం వచి్చనప్పుడు వీటి సంఖ్య తగ్గుతుంది. వీరికి వెంటనే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి ఉంటుంది. చికిత్సల పేరుతో కార్పొరేట్‌ ఆస్పత్రులు రోగులను భయభ్రాంతులకు గురిచేసి అత్యవసర చికిత్సల పేరుతో రోజుకు రూ.50 వేలకుపైగా చార్జీలు వేస్తున్నాయి. డెంగీ కేసుల వివరాలను ఏ రోజుకారోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు చేరవేయాల్సి ఉన్నా.. నగరంలోని ఏ ఒక్క కార్పొరేట్‌ ఆస్పత్రి కూడా ఆ సమాచారం ఇవ్వడం లేదు. అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు బాధితులను సస్పెక్టెడ్‌ డెంగీ కేసుల జాబితా లో ఉంచి చికిత్సలు చేస్తుండటం గమనార్హం.  

మరిన్ని వార్తలు