హైదరాబాద్‌: నగరంలో నరకయాతన.. మరో మూడు రోజులు భారీ వర్షాలు!

26 Sep, 2022 20:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. మరికొన్ని చోట్ల ఇంకా వర్షప్రభావం కొనసాగుతోంది.  

ఈ నేపథ్యంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక కుండపోత వర్షంతో రాజధాని హైదరాబాద్‌.. జంట నగరం సికింద్రాబాద్‌లు అతలాకుతలం అయ్యాయి. ఎటు చూసినా నగర జీవనం అస్తవ్యస్తంగా కనిపించింది. రెండు గంటల్లో.. దాదాపు 10 సెం.మీ. మేర కురిసింది వాన. మోకాళ్ల లోతు నీరు ఎటు చూసినా నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు భారీగా ట్రాఫిక్‌ఝామ్‌ కాగా.. కిలోమీటర్‌ దూరం దాటేందుకు గంటకు పైగా ఎదురు చూడాల్సి వస్తోంది. రంగారెడ్డి, శంషాబాద్‌ మండలాల్లోనూ భారీ వర్షాల ప్రభావం కనిపించింది. 

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయ్యింది. మూసీకి వరద నీరు పోటెత్తడంతో అంబర్‌పేట మూసారాంబాగ్‌ బ్రిడ్జి వద్ద భారీగా నీరు చేరింది. ఖైరతాబాద్‌-పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్‌జామ్‌ భారీగా అయ్యింది. చాలాచోట్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. వర్షం మొదలైన కాసేపటికే పరిస్థితిని అంచనా వేసిన అధికారులు ప్రయాణాన్ని రెండు గంటలపాటు వాయిదా వేసుకోవాలంటూ ట్రాఫిక్‌ పోలీసులు ముందస్తుగానే వాహనదారులకు సూచించడం తెలిసిందే. 

నగరంలో.. నాంపల్లిలో అత్యధికంగా 9.2 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే.. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో 8.6. ఖైరతాబాద్‌ 7.5 సెం.మీ. సరూర్‌నగర్‌ 7.2 సెం.మీ. రాజేంద్రనగర్‌లో 6.4 సెం.మీ, మెహదీపట్నంలో 4.5 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు