వినాయక నిమజ్జనానికి అనుమతివ్వొద్దు: హైకోర్టు

12 Aug, 2021 08:00 IST|Sakshi

గత ఆదేశాలను ఇప్పుడూ అమలు చేయండి: హైకోర్టు 

గడువు కోరిన స్పెషల్‌ జీపీ  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలతోపాటు ఇతర పర్వదినాల సందర్భంగా జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. గత ఏడాది తరహాలోనే ఎటువంటి జనసమూహాలకు అనుమతి ఇవ్వరాదని, అలాగే విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వరాదని, ఈ మేరకు గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. నిమజ్జనంపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించేందుకు మరికొంత గడువుకావాలని స్పెషల్‌ జీపీ హరీందర్‌ అభ్యరి్థంచడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, వినాయక చవితి తర్వాత నిర్ణయాన్ని చెబుతారా అంటూ మండిపడింది. వారంలోగా ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు