ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించారా?: హైకోర్టు

28 Aug, 2020 03:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జైళ్లలో ఉన్న విచారణ ఖైదీలు, శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించారా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏయే జైళ్లలో కరోనా పరీక్షలు నిర్వహించారు? ఎంత మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు? వారిని చికిత్స నిమిత్తం ఎక్కడికి తరలించారు? సాధారణ లక్షణాలున్న వారి కోసం ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారా ? వంటి పూర్తి వివరాలు తదుపరి విచారణ నాటికి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జైళ్లలో జీవిత ఖైదు, ఇతర శిక్షలు అనుభవిస్తున్న వారిలో ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వారిని మధ్యంతర బెయిల్‌ మీద విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త యు.సాంబశివరావు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. జైళ్లలో కరోనా పరీక్షలు నిర్వహించాలని, ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వారిని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మీద విడుదల చేసేలా ఆదేశించాలని పిటిషనర్‌ తరఫున న్యాయవాది వి.రఘునాథ్‌ నివేదించారు. ఎంతమంది ఖైదీలు కరోనా బారిన పడ్డారని ధర్మాసనం రఘునాథ్‌ను ప్రశ్నించగా పరీక్షలు నిర్వహిస్తే తెలుస్తుందని తెలిపారు. జైళ్లలో ఎక్కడా కరోనా పరీక్షలు నిర్వహించలేదని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. ముంబై జైలులో 55 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారని, ఈ నేపథ్యంలో ఇక్కడా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణ నాటికి తాము కోరిన వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్‌ 10వ తేదీకి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు