హెచ్‌ఎండీఏలో అంతా మా ఇష్టం.. ఆన్‌లైన్‌లో స్వీకరణ.. ఆఫ్‌లైన్‌లో జారీ

9 May, 2022 08:33 IST|Sakshi

మాస్టర్‌ ప్లాన్‌లో యథేచ్ఛగా మార్పులు చేర్పులు 

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ.. ఆఫ్‌లైన్‌లో జారీ 

ఎంఎస్‌బీఆర్‌ కమిటీ నిబంధనలు బుట్టదాఖలు  

అడ్డగోలుగా భవన నిర్మాణ అనుమతులు

సాక్షి, హైదరాబాద్‌: భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్‌ అనుమతుల జారీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు అధికారులు నిబంధనల్లో మార్పులు చేస్తున్నారు. కాల్వలు, పంటపొలాలు, వక్ఫ్‌స్థలాలు సైతం ఉన్నపళంగా ‘రెసిడెన్షియల్‌ జోన్‌’ జాబితాలో చేరిపోతున్నాయి, నిర్మాణదారులు నేరుగా హెచ్‌ఎండీఏకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టీఎస్‌బీపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ.. నేరుగా కలిస్తే తప్ప పనులు కావడం లేదు.

మరోవైపు ఎంఎస్‌బీఆర్‌ (మల్టీ స్టోర్డ్‌ బిల్డింగ్‌ రెగ్యులేటరీ కమిటీ) సమావేశాలు ఏర్పాటు చేయకుండానే బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులను ఇస్తున్నట్లు  ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని శంకర్‌పల్లి, శంషాబాద్, మహేశ్వరం, మేడ్చల్, శేరిలింగంపల్లి, ఘట్కేసర్‌ తదితర ప్రాంతాల్లో నిబంధనలను పాతరేసి లేఅవుట్‌ పర్మిషన్లు ఇస్తున్నారు.   

ఉల్లంఘనలు ఇలా.... 
∙తెల్లాపూర్, నల్లగండ్ల తదితర ప్రాంతాల్లో  కొన్ని భూములపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో వివాదం కొనసాగుతోంది. ఈ భూములు వ్యవసాయ కాల్వల  పరిధిలో ఉండటంతో  ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. కానీ కొంతమంది రియల్టర్లు  కొందరు అధికారుల సహకారంతో వివాదాస్పద భూ ముల్లోనూ అక్రమ నిర్మాణాలకు తెరలేపారు.  
∙తెల్లాపూర్‌లోని ఓ సర్వే నంబర్‌లో ఉన్న  ఇలాంటి  పంట కాల్వ (క్రాఫ్ట్‌ కెనాల్‌) పరిధిలోని 5 ఎకరాల భూమిలో 9 అంతస్తుల భవనానికి ఇటీవల అనుమతులిచ్చారు. ఈ మేరకు  హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ‘రెసిడెన్షియల్‌ జోన్‌’గా  మార్చేశారు. సదరు నిర్మాణ సంస్థ రెండేళ్ల క్రితమే భవన నిర్మాణ అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని నిబంధలకు విరుద్ధంగా ఉన్నట్లు అప్పట్లో ఓ ఉన్నతాధికారి  ఏకంగా నాలుగుసార్లు తిరస్కరించారు. చివరకు  ఇటీవల  మోక్షం  లభించింది. 

ఎంఎస్‌బీఆర్‌ (మల్టీ స్టోర్డ్‌ బిల్డింగ్‌ రెగ్యులేటరీ ) కమిటీ సమావేశం కూడా లేకుండానే అనుమతులను ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఎంఎస్‌బీఆర్‌ కమిటీ గతంలో నిర్వహించిన సమావేశాల్లోని మినిట్స్‌లో మార్పులు చేసినట్లు తెలిసింది. నిర్మాణదారులకు, అధికారులకు నడుమ  మధ్యవర్తులే అన్ని విధాలా  “ఈ వ్యవహారాన్ని’ నడిపించడం గమనార్హం.  

ఏమార్చి ఎల్‌పీ ఇచ్చారు... 
అధికారులు తలుచుకుంటే చెరువులు, కుంటలు, అడవులు సైతం నివాసయోగ్యమైన జాబితాలో చేరిపోతాయి. చివరకు వక్ఫ్‌భూములకు సైతం రక్షణ కొరవడింది. మహేశ్వరం మండలంలోని కొంగరకుర్దు గ్రామంలో ఓ సర్వే నంబర్‌లో ఉన్న 11.17 ఎకరాల వక్ఫ్‌భూమిని ఇలాగే మార్చేసి లే అవుట్‌ పర్మిషన్‌ ఇచ్చారు. ధరణిలోనూ, రిజిస్ట్రార్‌ రికార్డుల్లోనూ ఇది నిషేధిత జాబితాలో ఉంది.

దీనిపై ఇటీవల స్థానికంగా  తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అధికారులు  అప్రమత్తమయ్యారు. తాజాగా మరోసారి అదేస్థలంలో నిర్మాణ అనుమతులను పొందేందుకు  ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు  తెలిసింది. ‘మాస్టర్‌ప్లాన్‌లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న స్థలాల్లో రకరకాల కొర్రీలు పెట్టి తిప్పుకొంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములకు మాత్రం  అడ్డగోలుగా అనుమతులిచ్చేస్తారు’అని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రతినిధి  విస్మయం వ్యక్తం చేశారు. 

చదవండి: ..అంతకుమించి.. బీజేపీ దృష్టి మొత్తం ఆ సభ మీదే!

మరిన్ని వార్తలు