కరోనా: బీమా ఉందని ధీమాతో వెళితే!

25 Aug, 2020 08:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌:  కోవిడ్‌తో బాధపడుతున్న మల్కజ్‌గిరికి చెందిన డి.నరసింహ్మ(67) ఈ నెల 10న సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ఆయనకు ఆరోగ్య బీమా కార్డు ఉన్నప్పటికీ నగదు చెల్లించేందుకు అంగీకరిస్తేనే అడ్మిట్‌ చేసుకుంటామని ఆస్పత్రి అధికారులు స్పష్టం చేశారు.  దీంతో కుటుంబసభ్యులు అంగీకరించారు.  అయితే కేవలం ఐదు రోజులకే రూ.6.29 లక్షలు బిల్లు వేశారు. అప్పటికే రూ.2.50 లక్షల వరకు చెల్లించారు. మిగిలిన మొత్తం కూడా చెల్లించాలని ఒత్తిడి చేయడంతో అంత మొత్తం తాము చెల్లించే పరిస్థితిలో లేమని చెప్పారు. ఆస్పత్రి ఒప్పుకోకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది ఒక్క నరసింహ కుటుంబ సభ్యులు మాత్రమే ఎదురైన అనుభవం మాత్రమే కాదు...కరోనా  బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన అనేకమంది ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. 

మూడు ఆస్పత్రులపై కేంద్రానికి ఫిర్యాదు:  
నగరంలోని ప్రధాన ఆస్పత్రులన్నీ ఇందుకు నిరాకరిస్తుండటంతో బీమా కంపెనీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో బాధితులు నేరుగా నేషనల్‌ ఫార్మాష్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేస్తున్నారు. సామాజిక కార్యకర్త విజయ్‌ ఇటీవల ఇదే అంశంపై నగరంలోని కేర్, యశోద, మెడికవర్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులపై ఫిర్యాదు చేయడం విశేషం. కోవిడ్‌ చికిత్సల్లో ఉపయోగించిన మందులు, వాటి ధరలు, చికిత్స ఖర్చులను తెలియజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం విశేషం.  

బీమా..గీమా జాంతానై...
కరోనా సోకినపుడు ఆరోగ్య బీమా కార్డు ఉందనే ధీమాతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళితే ఆయా ఆస్పత్రులు ఈ పాలసీ దారులకు చికిత్సలను నిరాకరిస్తున్నాయి. నగరంలోని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రులన్నీ ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నగదు చెల్లించేందుకు అంగీకరిస్తేనే అడ్మిషన్‌ ఇస్తామంటూ మెలిక పెడుతున్నాయి. ఆపదలో చేసేది లేక కొంత మంది చెల్లిస్తున్నారు.తీరా డిశ్చార్జి సమయంలో తాము ఇప్పటి వరకు చెల్లించిన మొత్తానికి బిల్లు ఇస్తే ఇన్స్‌రెన్స్‌ క్లెయిమ్‌కు వెళ్తామని బాధిత కుటుంబ సభ్యులు చెబితే అందుకు కూడా అంగీకరించడం లేదు.  

మచ్చుకు కొన్ని ఘటనలు 
⇔ పాతబస్తీకి చెందిన సలీంఖాన్‌కు ఇటీవల మలక్‌పేటలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో బ్రెయిన్‌ సర్జరీ చేశారు. గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు. చికిత్సకు రూ.5 లక్షలు ఛార్జీ చేశారు. ఇప్పటికే రూ.2 లక్షలు చెల్లించారు. ఆయనకు బీమా ఉంది. అయినప్పటికీ మొత్తం బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 
 చంపాపేటకు చెందిన ఉమావతి(55)ని చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఈ నెల 15వ తేదీన మలక్‌పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సస్పెక్టెడ్‌ కోవిడ్‌గా నిర్ధారించి, చికిత్స ప్రారంభించారు. మూడు రోజులకు రూ.2.50 లక్షలు బిల్లు వేశారు. మరో రెండు వారాల పాటు చికిత్స చేస్తామని.. రూ.14 లక్షల బిల్లు అవుతుందన్నారు.  బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 
⇔ ఖమ్మంజిల్లా నాయుడుపేటకు చెందిన వ్యక్తి(52) ఈనెల 5న సోమాజిగూడలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. కోలుకోవడంతో రెండు రోజుల క్రితం ఆయన్ను డిశ్చార్జ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.  రూ.1,213,932 బిల్లు వేశారు.  అప్పటికే ఆయన రూ.7.50 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లిస్తేనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ జీఓ నెంబర్‌ 248 ప్రకారం బిల్లు చెల్లించేందుకు బాధితుని బంధువులు అంగీకరించారు. కానీ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఆ జీఓలేవీ తమ వద్ద చెల్లవని, మొత్తం బిల్లు చెల్లిస్తేనే డిశ్చార్జి చేస్తామని స్పష్టం చేయడంతో చేసేది లేక వారు అడిగిన మొత్తం చెల్లించి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.  

మరిన్ని వార్తలు