అల్పాహారం.. అల్లంతదూరం!

19 Mar, 2022 11:56 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌ అర్బన్‌: ఎమర్జెన్సీగా బయటకు వెళ్లే వారు ఎక్కడో ఒకచోట ఆగి ఇష్టమైన టిఫిన్‌ చేద్దామని అనుకుంటారు. నోటి రుచి కోసం మరికొందరు టిఫిన్‌ సెంటర్ల నుంచి పార్సిల్‌ తెచ్చుకొని ఆరగిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కువగా కనిపించడం లేదు. కొంత ఆలస్యమైనా సరే ఇంట్లోనే టిఫిన్‌ చేసి పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నారు. కొంత ఆలస్యమైనా ఇంట్లోనే అల్పాహారం చేసుకుని తింటున్నారే గాని బయట కొనుక్కోవడానికి పెద్దగా ఇష్ట పడటం లేదు. ఎందుకంటే కరోనాకు ముందు ఉన్న టిఫిన్‌ ధరలు ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. హోటళ్లలో టిఫిన్ల ధరలు అమాంతం పెంచేశారు.

కరోనాకు ముందు వికారాబాద్‌ లాంటి పట్టణాల్లోని పెద్ద పెద్ద హోటళ్లలో ప్లేటు ఇడ్లీ రూ. 20 మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్లేటు ఇడ్లీ రూ.35కు పెరిగింది. గతంలో ప్లేట్‌ వడ(2) రూ. 30 ఉండగా ఇప్పుడు రూ. 45 అమ్ముతున్నారు. నాలుగు బోండాలు.. రూ. 25 ఉండగా ఇప్పుడు రూ. 40కి పెంచారు. ప్రస్తుతం ఒక పరోటా రూ.30కి అమ్ముతున్నారు. గతంలో ప్లేన్‌ దోశ రూ. 20 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ. 30కి పెంచారు. మసాల దోశ రూ. 40కి చేర్చారు. ఇక కాస్త రుచికోసం ఆనియన్‌ దోశ, ఉత్తప్ప వంటివి కోరితే మాత్రం రూ. 50 చెల్లించాల్సిందే. టిఫిన్‌ చేశాక కాస్త తియ్యగా టీ, కాఫీ తాగాలనుకునే వారికి తాగక ముందే ధరలను చూసి చేదు అనిపిస్తుంది. కరోనా కంటే ముందు టీ కొన్ని చోట్ల రూ. 5, కొన్ని చోట్ల రూ. 8 అమ్మేవారు. ఇప్పుడు అన్నీ చోట్ల టీ రూ. 10కి అమ్ముతున్నారు. కాఫీ కాస్త రూ. 15కు చేశారు. ధరలు ఇలా ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు టిఫిన్లు చేయలేని పరిస్థితి నెలకొంది.  

మీల్స్‌ సైతం.. 
ఇదిలా ఉండగా హోటళ్లలో ప్లేట్‌ అన్నం రూ. 50 లభించేది. ఇప్పుడు ఏకంగా రూ. 70కి పెంచారు. ఫుల్‌ మీల్స్‌ రూ. 70 ఉండేది, ఇప్పుడు అత్యధిక హోటళ్లలో రూ. 100కు చేర్చారు. ఇలా చికెన్, మటన్‌ బిర్యానీల రేట్లు కూడా అమాంతం పెంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో  ధరలు పెంచక తప్పలేదని హోటళ్ల యజమానులు అంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు, హోటల్‌ అద్దెలు పెంచడంతో తాము ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా అధిక ధరలు  సామాన్యులను  రుచికరమైన అల్పాహారానికి కొంత దూరం చేసిందనే చెప్పవచ్చు.  

మరిన్ని వార్తలు