పోలీస్‌ కావడం ఎలా?

3 Nov, 2020 09:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థులకు కాలేజీల్లో బోధించనున్న విద్యాశాఖ

పోలీసు విభాగంతో కలిసి సంయుక్త కార్యాచరణ

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రయోగాత్మకంగా అమలు

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ చదివే విద్యార్థులకు ఇంటర్‌ విద్యాబోధనతో పాటు పోలీసుశాఖలో ఉద్యోగం సంపాధించేందుకు అవసరమైన అంశాల్లోనూ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు పోలీసుశాఖతో ఇంటర్మీడియట్‌ బోర్డు ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటర్మీడియట్‌ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠ్యాంశాల బోధనతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన జనరల్‌ నాలెడ్జ్, రీజనింగ్, ఇతర అంశాలతో పాటు రన్నింగ్, జంపింగ్‌ వంటి శారీరక ధృడత్వం వంటి అంశాలపై కూడా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు నగరంలోని ఏడు ఇంటర్మీడియట్‌ కాలేజీలను ఎంపిక చేసింది.

ప్రస్తుతం ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విభాగాల్లో విద్యార్థులను ఎంపిక చేసి, సామాజిక సేవా కార్యక్రమాలు, మానసిక, శారీరక క్రమశిక్షణ అంశాల్లో శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పోలీసు విభాగంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. తద్వారా విద్యార్థులు చిన్నతనంలో పక్కదారి పట్టకుండా ఉండటంతో పాటు పోలీసు వ్యవస్థపై అవగాహన ఏర్పడి, అటు వైపు ఆకర్షితులవుతారు. అంతేకాదు భవిష్యత్తులో ఆ శాఖలో ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉందని హైదరాబాద్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిని జయప్రదబాయి అభిప్రాయపడ్డారు. అంతేకాదు పోటీ పరీక్షల కోసం ప్రైవేట్‌ ఇనిస్టిట్యూషన్లను ఆశ్రయించాల్సిన అవసరం కూడా ఆయా విద్యార్థులకు ఉండదని ప్రకటించారు. ఆసక్తిగల అభ్యర్థులు శిక్షణ కోసం ఎంపిక చేసిన ఆయా కాలేజీల్లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉందని ఆమె సూ చించారు.  (చదవండి: అనాథ బాలురకూ ఆశ్రయం!)

శిక్షణ కోసం ఎంపిక చేసిన కాలేజీలు ఇవే...

  • గన్‌ఫౌండ్రీ అలియా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ
  • ప్రభుత్వ మహబూబియా బాలికల కళాశాల
  • మలక్‌పేట్‌ న్యూ జూనియర్‌ కాలేజీ
  • నాంపల్లి ఎంఏఎం జూనియర్‌ కాలేజీ
  • కాచిగూడ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ
  • ఫలక్‌నుమా బోయ్స్‌ జూనియర్‌ కాలేజీ
  • మారేడ్‌పల్లి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీ
మరిన్ని వార్తలు