లాస్‌ వెగాస్‌ తరహాలో సాగర్‌లో ఫౌంటెయిన్‌ షో

22 May, 2022 02:06 IST|Sakshi

సంజీవయ్య పార్కు వైపు అర ఎకరంలో 47 కోట్లతో నిర్మాణం

పర్యాటకులను ఆకట్టుకునేవిధంగా ఐటీడీసీ ఏర్పాట్లు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశంతో చకచకా చర్యలు  

సాక్షి, హైదరాబాద్‌: వందల మీటర్ల ఎత్తున విరజిమ్మే నీటిధారలు.. లయబద్ధంగా వినిపించే సంగీతం.. దానికి తగ్గట్టుగా జలవిన్యాసాలు.. ఆ జుగల్‌బందీని మరింత నేత్రపర్వం చేసే విద్యుత్తు వెలుగుజిలుగులు.. నీటిధారలనే తెరగా చేసుకుని దృశ్యమయం చేసే లేజర్‌ కాంతులు.. ఇది వాటర్‌ ఫౌంటెయిన్‌ షోలో కనువిందు చేయనున్న దృశ్యాలు. లాస్‌ వేగాస్‌ రిసార్ట్స్, దుబయ్‌ బుర్జు ఖలీఫా ఎదుట ఈ తరహా షోలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పుడు ఈ తరహాలో భాగ్యనగర పర్యాటకులకు కనువిందు చేసేలా కేంద్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(ఐటీడీసీ) ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్‌సాగర్‌ జలాల్లో దాదాపు అర ఎకరం విస్తీర్ణంలో భారీ ఫౌంటెయిన్‌ షోను ఏర్పాటు చేయబోతోంది. సంజీవయ్య పార్కులో ఉన్న భారీ జాతీయపతాకం వెనక సాగర్‌ నీటిలో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి కేంద్ర పర్యాటకాభివృద్ధి సంస్థ రూ.47 కోట్లను వ్యయం చేయనుంది. ఇప్పటికే ప్రాజెక్టు డిజిటల్‌ నమూనాను ఓ సంస్థ సిద్ధం చేసింది. నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్టు తెలిసింది.  

ఏమేముంటాయంటే.. 
సాగర్‌ జలాల్లో ఫ్లోటింగ్‌ జెట్స్‌పై ఈ భారీ ఫౌంటెయిన్‌ వ్యవస్థ ఏర్పాటవుతుంది. వేలసంఖ్యలో వాటర్‌ నాజిల్స్‌ ఏర్పాటు చేసి దాదాపు 500 అడుగుల ఎత్తు వరకు నీటిని విరజిమ్మేలా మోటార్లతో అనుసంధానిస్తారు. నీళ్లు విన్యాసాలు చేసేలా డిజైన్‌ చేస్తారు. దాంతోపాటు సంగీతం, లైటింగ్‌ ఏర్పాట్లు ఉంటాయి. నీళ్లు పైకి విరజిమ్మినప్పుడు ఏర్పడే తుంపర్లనే తెరగా చేసుకుని లేజర్‌ కిరణాలు రకరకాల ఆకృతులతో దృశ్యమయం చేస్తాయి. 

ఆర్ట్స్‌ కాలేజీ భవనమే తెరగా ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ సౌండ్‌ అండ్‌ లైట్‌ షో 
ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలోనే గొప్ప యూనివర్సిటీల్లో ఒకటి. ఇక ఆర్ట్స్‌ కళాశాల భవనం ఓ గొప్ప ఇంజనీరింగ్‌ అద్భుతం. ఇప్పుడు ఆర్ట్స్‌ కాలేజీ భవనం యావత్తును తెరగా చేసుకుని ఆధునిక ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. వాటర్‌ ఫౌంటెయిన్‌ షో ప్రాజెక్టుతో సంయుక్తంగా ఐటీడీసీ దీన్ని రూ.12 కోట్లతో చేపడుతోంది.

దీనికి ఇతివృత్తాన్ని ఇంకా ఎంపిక చేయనప్పటికీ, స్వాతంత్య్ర ఉద్యమం, ఉస్మానియా విశ్వవిద్యాలయం పాత్ర అన్నకోణంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆర్ట్స్‌ కాలేజీ ముందు వృథాగా ఉన్న ఫౌంటెయిన్‌ వ్యవస్థకు కూడా మెరుగులద్ది ప్రారంభించి ఈ ప్రాజెక్టుతో అనుసంధానించనున్నారు. 15 నిమిషాలపాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో విడివిడిగా షోలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశం మేరకు ఐటీడీసీ అధికారులు చకచకా ప్లాన్‌ చేసి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరానికి వచ్చే పర్యాటకులకు మధురానుభూతులు పంచేలా ఈ రెండు ప్రాజెక్టులను తీర్చిదిద్దబోతున్నారు.    

మరిన్ని వార్తలు