60 కాస్త 10 అయ్యింది.. పట్టించుకోండి సారూ

1 May, 2021 08:15 IST|Sakshi

సాక్షి ,హైదరాబాద్‌: ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని లోయర్‌ ట్యాంకు బండ్‌ గోశాల నుంచి ఏసీటీసీ కళాశాల మీదగా బీమామైదానం, ఇందిరా పార్కు రోడ్డు 60 అడుగుల వరకు ఉండేది. విశాలమైన ఈ రోడ్డుకు ఇరువైపులా గోశాల నుంచి ఇందిరా పార్కు రోడ్డు వరకు కార్లు, ద్విచక్ర వాహనాలను అక్రమంగా పార్కింగ్‌ చేస్తున్నారు.  డెంటింగ్, వాటర్‌ సర్వీసింగ్‌ తదితర వ్యాపారులు ఆక్రమించారు.

ఇష్టారాజ్యంగా మెకానిక్‌ షెడ్లను ఏర్పాటు చేశారు. మరమ్మతులకు వచ్చే వాహనాలు, వాహన చోదకులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్‌ చేసి సర్వీసింగ్‌ చేయడంతో 60 అడుగులు కాస్త 10 అడుగులకు కుంచించుకుపోయింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్‌ తిప్పలు తప్పడం లేదు. ఇదేమని ఎవరైనా వాహనదారులు అడిగితే ఘర్షణలు, వాగ్వాదాలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్గంలో మెకానిక్‌ షాపుల యజమానులు ఒకరిని మించి మరొకరు అక్రమంగా షెడ్లను నిర్మించి రోడ్లను ఆక్రమించారు. దీంతో పాదచారులు నడవడానికి కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. 
రోగులకు దారేదీ.. 
►   ఇదే మార్గంలో ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉంది. 
►   ఇక్కడికి నిత్యం వందలాది మంది వైద్యం కోసం వస్తుంటారు. 
►   ఇటీవల కరోనా నేపథ్యంలో ఈ సెంటర్‌ను కరోనా వైద్యం కోసం కేటాయించారు. 
►    దీంతో కవాడిగూడ డివిజన్‌తో పాటు ఇతర డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షల కోసం, వ్యాక్సిన్‌ కోసం వస్తున్నారు. 
►    వారి వాహనాలను పార్క్‌ చేయడానికి స్థలం లేకపోవడంతో ఇబ్బందులకు గురువుతున్నారు. 
పట్టించుకోని ట్రాఫిక్‌ పోలీసులు.... 
అనేక సంవత్సరాలుగా రోడ్డును ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని విపరీతంగా షెడ్లను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్‌ ఇబ్బందులకు కారణం అవుతున్న షెడ్ల యజమానులపై ట్రాఫిక్‌ పోలీసులు ఎలాంటి  చర్యలు తీసుకోకపోవడం ఫలితంగా రోజు రోజుకు కొత్త షెడ్లు ఈ మార్గంలో రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్‌ పోలీసులు దృష్టిసారించి, ట్రాఫిక్‌ సమస్యతో ఇబ్బందిపడుతున్న రోడ్డు ఆక్రమణలను తొలగించాలని పలువురు వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు.

( చదవండి: సిబ్బంది మధ్య వార్‌.. నిలిచిపోయిన కరోనా పరీక్షలు..

మరిన్ని వార్తలు