కొండా‘పూర్‌’ మ్యూజియం: అదో పట్టణం, బౌద్ధ కేంద్రం కానీ..

18 May, 2023 10:20 IST|Sakshi

కొండా‘పూర్‌’ మ్యూజియం అదో పట్టణం.. అందమైన ఇళ్లు, భూగర్భ గృహాలతో కళకళలాడింది. అదో వ్యాపార కేంద్రం.. అత్తరు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేది.. అందుకు ప్రత్యేకంగా కయోలిన్‌ క్లేతో అత్తరు బుడ్లను తయారు చేసేవారు.. ఈ వ్యాపారంలో ప్రముఖ పాత్ర రోమన్‌ వ్యాపారులదే. అదో బౌద్ధ కేంద్రం.. స్తూపం, చైత్యం, ఆధ్యాతి్మక మందిరాలు ఎన్నో రూపుదిద్దుకున్నాయి.  ఇదంతా ఎక్కడో కాదు, సంగారెడ్డి పట్టణానికి చేరువగా ఉన్న కొండాపూర్‌ కేంద్రంగా సాగింది. కానీ అది ఇప్పుడు కాదు, క్రీ.పూ. 2వ శతాబ్దం– క్రీ.శ.2వ శతాబ్దం మధ్య కాలం నాటి సంగతి.

సాక్షి,హైదరాబాద్‌: శాతవాహనులు పాలించిన ప్రాంతంలో ఇప్పటివరకు జరిపిన తవ్వకాల్లో లభించిన నాణేల్లో సగానికంటే ఎక్కువ లభించిందిఈ కొండాపూర్‌ ప్రాంతంలోనే. రోమన్‌ చక్రవర్తి అగస్టస్‌ హయాంలో చెలామణిలో ఉన్న బంగారు నాణేలూ ఇక్కడ లభించాయి. గౌతమీ పుత్ర శాతకర్ణి.. పులుమావి శాతకరి్ణ, యజ్ఞశ్రీ శాతకర్ణి లాంటి వారు అక్కడికి వచ్చి ఉంటారన్నది చరిత్రపరిశోధకుల మాట. ఇప్పుడు పోర్సోలిన్‌ అనగానే చైనా తయారీ బొమ్మలు గుర్తుకొస్తాయి. కానీ రెండు వేల ఏళ్ల క్రితమే ఇక్కడ ఆ మట్టితో బొమ్మలు రూపొందించారు.

►ఇంత ఘనమైన చరిత్ర ఉన్న కొండాపూర్‌ ప్రాంతంలో 19వ శతాబ్దం నుంచి జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసిన ఎన్నో గొప్ప ఆధారాలను ప్రదర్శనకు ఉంచిన ఓ మ్యూజియం ఉంది. అయితే, అది మూడేళ్లుగా మూతపడి ఉంది. రాష్ట్రంలో కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ) అధీనంలో ఉన్న ఏకైక మ్యూజియం ఇదే కావటం గమనార్హం.

ప్రచారం లేకపోవడంతో... 
మ్యూజియం భవనం నిర్వహణ బాగానే ఉన్నా, కట్టడ పటుత్వం దెబ్బతినటంతో రూ.2.5 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. కానీ దానికి అనుమతి రాకపోవటంతో, ఉన్నదాన్నే బాగుచేసి, కొత్త గ్యాలరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇంతలో కోవిడ్‌ మహమ్మారి విస్తరించటంతో 2020లో దాన్ని మూసేశారు. ఆ తర్వాత మరమ్మతులు మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఫలితంగా మ్యూజియం మూసే ఉంది. దీంతో విలువైన, సున్నితమైన వస్తువులను చూసే వీలు లేకుండాపోయింది. అంత గొప్ప మ్యూజియం ఉందన్న ప్రచారం లేకపోవటంతో ప్రజలకు దాని గురించే తెలియకుండా పోయింది. 

విదేశాల్లో ఉంటే కిటకిటలాడేదేమో.. 
ముందస్తుగా ఫోన్‌ చేసి చెప్పి ఇటీవలే ఆ మ్యూజియాన్ని సందర్శించి అబ్బురపడ్డాను. 2 వేల ఏళ్ల క్రితమే మన చరిత్ర ఇంత గొప్పదా అనిపించే స్థాయి ఆధారాలు అక్కడ ఉన్నాయి. కానీ, వాటి ని చూసేందుకు జనమే రారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఇంత గొప్ప ఆధారాలతో విదేశాల్లో మ్యూజియం ఉంటే జనంతో కిటకిటలాడేది. 
– చిన వీరభద్రుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి

త్వరలో పునరుద్ధరిస్తాం 
కొండాపూర్‌ మ్యూజియం మన అద్భుత చరిత్రకు నిదర్శనం. దాని విషయంలో నిర్లక్ష్యం చేయం. కొత్త భవనం అనుకున్నా, ఉన్నదాన్నే బాగుచేద్దామని నిర్ణయించి పనులు జరుపుతున్నాం. త్వరలో మ్యూజియాన్ని పునరుద్ధరిస్తాం.
    – మహేశ్వరి, ఏఎస్‌ఐ రీజినల్‌ డైరెక్టర్‌

చదవండి: ఇంటర్నేషనల్‌ కాల్స్‌ వస్తున్నాయా?! ఒక్క క్లిక్‌తో అంతా ఉల్టా పల్టా!

మరిన్ని వార్తలు