శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌.. కొత్తగా మరో టెర్మినల్‌

6 Apr, 2022 20:10 IST|Sakshi

తూర్పు వైపు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మొదటి దశ టెర్మినల్‌ విస్తరణ

కొత్తగా 15,742 చదరపు మీటర్‌ల టర్మినల్‌ ఏర్పాటు

సీఐఎస్‌ఎఫ్‌ తనిఖీల అనంతరం అందుబాటులోకి..

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల సదుపాయాల విస్తరణలో మరో అడుగు ముందుకేసింది. విమానాల రాకపోకల సామర్థ్యం పెంపునకు అనుగుణంగా చేపట్టిన టెర్మినల్‌ మొదటి దశలో భాగంగా తూర్పు వైపు కొత్తగా 15,742 చదరపు మీటర్ల టెర్మినల్‌ అందుబాటులోకి వచ్చింది. భద్రతా తనిఖీల అనంతరం మరో నెల రోజుల్లో దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొనే అవకాశం ఉంది. తాజాగా పూర్తి చేసిన విస్తరణతో ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ వైశాల్యం 3,79,370 చదరపు మీటర్లకు పెరిగింది. సాలీనా సుమారు 3.4 కోట్ల మంది ప్రయాణీకుల సామర్థ్యానికి వీలుగా ఎయిర్‌పోర్టు విస్తరణ చేపట్టారు. ఇందులో భాగంగా తొలి దశ టర్మినల్‌ విస్తరణలో కొంత భాగం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 

అదనంగా పలు సౌకర్యాలు..
ఏటా కోటి 20 లక్షల మంది ప్రయాణికుల కోసం ఏర్పాటు  చేసిన ఎయిర్‌పోర్టులో 2019 నాటికి ప్రయాణికుల సంఖ్య  2.1 కోట్లకు చేరింది. దీంతో ఎయిర్‌పోర్టు విస్తరణపై దృష్టి సారించారు. ఇంటర్నేషనల్‌ ఇంటెరిమ్‌ డిపార్చర్‌ టెర్మినల్, ఇంటెరిమ్‌ డొమెస్టిక్‌ అరైవల్‌ టెర్మినల్‌ను రెండేళ్ల  క్రితం ప్రారంభించారు. విస్తరించిన ఇంటిగ్రేటెడ్‌ ప్యాసింజర్‌ టెర్మినల్‌తో 149 చెక్‌ఇన్‌ కౌంటర్లు, ఏటీఆర్‌ఎస్‌తో కూడిన  26 సెక్యూరిటీ స్క్రీనింగ్‌ మెషీన్లు, 44 ఎమిగ్రేషన్, 44 ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లు అందుబాటులోకి రానున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన పయర్‌ భవనాల్లో మరిన్ని లాంజ్‌లు, రిటైల్‌ అవుట్‌లెట్లు ఉంటాయి. అలాగే 44 కాంటాక్ట్‌ గేట్లు, 28 రిమోట్‌  డిపార్చర్‌ గేట్లు, 9 రిమోట్‌ అరైవల్‌ గేట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. (క్లిక్: ఫలించిన పరి‘శ్రమ’.. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు)

రన్‌వే సామర్థ్యం పెంపు...
రన్‌వే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొత్తగా నాలుగు రాపిడ్‌ ఎగ్జిట్‌ టాక్సీ వేలను ఏర్పాటు చేశారు. దీంతో విమానాలు తక్కువ దూరంలోనే రన్‌వే నుంచి ట్యాక్సీ ఆఫ్‌ కావడానికి అవకాశం ఉంటుంది. రన్‌వే ఆక్యుపెన్సీ సమయం కూడా తగ్గి, సామర్థ్యం పెరుగనుంది. అలాగే సెకెండరీ రన్‌ వేను ఉపయోగించుకునే సందర్భంలో సమర్థవంతమైన ఆపరేషన్‌ కోసం మరో కొత్త సమాంతర ట్యాక్సీవేను కూడా అభివృద్ధి చేశారు. కొత్తగా మూడు ఎయిరోబ్రిడ్జిలు కూడా అందుబాటులోకి రానున్నాయి. కాంటాక్ట్‌లెస్‌ ప్రయాణం కోసం 6 ఎలక్ట్రానిక్‌ గేట్‌లను ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల కోసం అన్ని సదుపాయాలతో కూడిన రెండు బేబీ కేర్‌ రూములు, 2 ఫ్యామిలీ రూమ్‌లను నిర్మించారు. ప్రయాణికులు, వాహనాల రాకపోకలకు అనుగుణంగా కొత్తగా ఒక సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. (క్లిక్: నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు!

మరిన్ని వార్తలు