టీవీ 5 బీఆర్‌ నాయుడు నిర్వాకం.. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలో అక్రమాలు

30 Apr, 2022 03:50 IST|Sakshi
చిరంజీవికి స్థలం అమ్మినట్టు  నాగరాజు, బీఆర్‌ నాయుడు సంతకాలు చేసిన రిజి్రస్ట్రేషన్‌ పత్రం  

రోడ్డు స్థలాన్ని అక్రమంగా చిరంజీవికి అమ్మిన వైనం

సొసైటీ ప్రెసిడెంట్‌ బీఆర్‌ నాయుడు (టీవీ–5) నిర్వాకం

595 గజాల స్థలం అక్రమంగా రిజిస్ట్రేషన్‌.. మార్కెట్‌ విలువ గజానికి రూ.4 లక్షలు ఉండగా ప్రభుత్వ ధర రూ. 64 వేలకు రిజిస్ట్రేషన్‌

రూ. 23.80 కోట్ల విలువైన స్థలం.. రూ. 3.80 కోట్లకే అప్పగింత

ప్రతిఫలంగా మిగిలిన సొమ్ములో భారీగా దండుకున్నట్లు ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో అక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. సొసైటీ ప్రెసిడెంట్‌ బి. రవీంద్రనాథ్ (టీవీ–5 అధిపతి బీఆర్‌ నాయుడు), ట్రెజరర్‌ పి.నాగరాజులు సొసైటీ బైలాస్‌కు విరుద్ధంగా, కో–ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా విలువైన స్థలాన్ని ప్రముఖ హీరో కొణిదెల చిరంజీవికి విక్రయించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 25లోని ప్లాట్‌ నంబర్‌–303–ఎన్‌లో చిరంజీవికి 3,333 గజాల స్థలంలో ఇల్లు ఉంది.

దాన్ని ఆనుకొని వెనుక భాగంలో షేక్‌పేటలోని కొత్త సర్వే నంబర్‌ 120 (పాత సర్వే నంబర్‌ 403/1), హకీంపేట గ్రామంలోని సర్వే నంబర్‌ 102/1లోని 595 గజాల అదనపు స్థలాన్ని (అడిషినల్‌ ల్యాండ్‌) అక్రమంగా చిరంజీవికి రిజిస్ట్రేషన్‌ చేశారు. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ గజానికి రూ. 4 లక్షలపైనే పలుకుతుండగా ప్రభుత్వ ధర ప్రకారం రూ. 64 వేల చొప్పున రిజిస్ట్రేషన్‌ చేశారు. అంటే రూ. 23.80 కోట్లు విలువజేసే స్థలాన్ని కేవలం రూ. రూ. 3.80 కోట్లకే అప్పగించి ప్రతిఫలంగా మిగిలిన సొమ్ములో పెద్ద మొత్తంలోనే దండుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పాలక వర్గం అక్రమాలపై సొసైటీ సభ్యులు ప్రభాకర్‌రావు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌కు, విజిలెన్స్, కో–ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం షేక్‌పేట మండల సర్వేయర్‌ సాయికాంత్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ రాజేశం క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టారు.

సొసైటీ మీటింగ్‌లోనూ చెప్పలేదు
ఇది ప్రభుత్వ స్థలమని, రోడ్డు ఆక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారని ప్రభాకర్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా సొసైటీలోని కొందరు అక్రమంగా ఈ రిజిస్ట్రేషన్‌ చేశారన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌కు తెలిసే ఈ తతంగం జరిగిందని, సొసైటీ లేఔట్‌ను పరిశీలించకుండానే దీన్ని రిజిస్ట్రేషన్‌ చేశారని ఆరోపించారు. ఈ ప్రక్రియలో కో–ఆపరేటివ్‌ నిబంధనలను తుంగలో తొక్కారని ఆయన దుయ్యబట్టారు. సొసైటీ జనరల్‌ బాడీ మీటింగ్‌లోనూ రిజిస్ట్రేషన్‌ సంగతి సభ్యులకు ప్రెసిడెంట్, ట్రెజరర్‌ తెలియజేయలేదని ఆరోపించారు.

బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి
ఫిర్యాదు చేసినప్పటి నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఎవరు చేస్తున్నారో వాళ్ల నంబర్లు కూడా కనిపించట్లేదు. వెంటనే ఫిర్యాదు ఉపసంహరించుకోకపోతే ప్రాణాలకు ముప్పు ఉంటుందని బెదిరిస్తున్నారు. బెదిరింపు కాల్స్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తా.
– ప్రభాకర్‌రావు, సొసైటీ సభ్యుడు

మరిన్ని వార్తలు