Koti Womens College: తొలి మహిళా వర్సిటీగా  కోఠి ఉమెన్స్‌ కాలేజీ

19 Jan, 2022 03:23 IST|Sakshi

 విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదంతో మళ్లీ తెరపైకి.. 

రెండేళ్లలో శత వసంతాలకు చేరుతున్న మహిళా కళాశాల 

ఇప్పటికే యూజీసీ నుంచి స్వతంత్ర హోదా.. న్యాక్‌ గుర్తింపు 

మహిళల పురోభివృద్ధికి ఊతమిస్తుందంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: రెండేళ్లలో శత వసంత ఉత్సవాలకు సిద్ధమవుతున్న హైదరాబాద్‌ కోఠి మహిళా కళాశాల.. తెలంగాణ తొలి మహిళా యూనివర్సి టీగా మారనుంది. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మహిళా విశ్వవిద్యాల యం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సంగతి తెలి సిందే. దీనికి సంబంధించి సమగ్ర నివేదిక కోసం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. గతంలో అనుకున్న మేరకు కోఠి విమెన్స్‌ కాలేజీలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. 

నాలుగేళ్ల కిందే అనుకున్నా.. 
తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయం ఉమ్మడి రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీగా అందుబా టులో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు మహిళా యూనివర్సిటీ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తెలంగాణలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు వచ్చింది. 2018 మార్చిలో జాతీయ ఉన్నత విద్యా శిక్షా అభియాన్‌(రూసా) కింద కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చాలని భావించా రు. అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి.. ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరిపారు. తర్వాత విమెన్స్‌ కాలేజీని సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ మహిళా కళాశాలలో ఒక్క పరిశోధనా సౌకర్యాలు మాత్రమే లేవని, విశ్వ విద్యాలయంగా మారితే పరిశోధనలు కూడా ప్రారంభమవుతాయని ఆయన అప్పట్లో పేర్కొన్నారు.  

నిధుల విషయంగా నిలిచిపోయి..: మహిళా వర్సిటీ ఏర్పాటు కోసం రూ.50 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అప్పట్లో సుముఖత వ్యక్తం చేసింది. దీనికి అదనంగా మరో రూ.100 కోట్లు వెచ్చిస్తేనే.. సకల వసతులతో విశ్వవిద్యాలయంగా మార్చవచ్చని ఉస్మానియా వర్సిటీ అధికారులు అంచనాలు రూపొందించారు. కానీ ఆ తర్వాత పెండింగ్‌లో పడింది. అయితే ఉస్మానియా వర్సిటీ స్వర్ణోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్‌.. కోఠి ఉమెన్స్‌ కాలేజీకి రూ.37 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ ప్రతిపాదనతో మహిళా వర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 

స్వయం ప్రతిపత్తి హోదా నుంచి.. 
1924లో నిజాం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున సుమారు 42 ఎకరాల వైశాల్యంలో కోఠి విమెన్స్‌ కాలేజీ ఏర్పాటైంది. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతోంది. 1998లో యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి (అటానమస్‌) హోదా లభించింది. మూడు సార్లు న్యాక్‌ గుర్తింపు దక్కించుకుంది కూడా. ప్రస్తుతం 57 అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు, 20 పీజీ కోర్సులు కొనసాగుతున్నాయి. కాలేజీలో 4,091 మంది రెగ్యులర్, 150 మంది డిప్లొమా, 17 మంది విదేశీ విద్యార్థినులు చదువుకుంటున్నారు. వంద మంది రెగ్యులర్, మరో 100 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. విశ్వవిద్యాలయంగా మారితే.. ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఉన్న మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలన్నింటినీ కోఠి మహిళా వర్సిటీకి అనుబంధ కాలేజీలుగా మార్చే అవకాశాలున్నాయి. 

అర్హతలున్నాయ్‌.. నిధులే కావాలి 
కోఠి ఉమెన్స్‌ కాలేజీని మహిళా వర్సిటీగా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలున్నాయని.. అయితే కనీసం రూ.వంద కోట్లు నిధులు వెచ్చించాల్సి ఉంటుందని ఉన్నత విద్య అధికారులు తేల్చారు. ముఖ్యంగా మౌలిక వసతుల మెరుగుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తించారు. రాష్ట్రంలో విమెన్స్‌ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఉన్నత విద్య మండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ, కోఠి విమెన్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ విద్యుల్లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు తమ ప్రతిపాదనలు, అభిప్రాయాలను మంత్రికి వివరించారు. ఈ మేరకు అవసరమైన మౌలిక సదుపాయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

కొంతకాలం ఓయూ పర్యవేక్షణలోనే.. 
కోఠి విమెన్స్‌ కాలేజీని వర్సిటీగా మార్చినా.. కొంతకాలం ఉస్మానియా వర్సిటీ నేతృత్వంలోనే కొనసాగే వీలుందని అధికారులు అంటున్నారు. కొత్త వర్సిటీకి వెంటనే గుర్తింపు అందడం కష్టమని.. అందువల్ల మూడేళ్ల పాటు ఓయూ పేరిటే సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.   

మంచి నిర్ణయమిది.. 
ఉన్నత విద్యావంతుల జాబితాలో మహిళల సంఖ్య పెరుగుతోంది. మహిళా కాలేజీలు చాలా ఉన్నా.. వర్సిటీ లేదనే కొరత ఉండేది. ఆ దిశగా ముందడుగు వేసిన సీఎం నిర్ణయం అభినందనీయం. 
– ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ 

మహిళలకు మరింత ప్రోత్సాహం 
చాలా వరకు డిగ్రీతోనే చదువు ఆపేసే మహిళ లు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత పైస్థాయి విద్యకు ఆసక్తి చూపుతున్నారు. ఉస్మానియా క్యాంపస్‌ హాస్టళ్లలో మహిళలకే ఎక్కువ భవనాలు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడింది. 70% ఉన్నత విద్యావంతులు వారే ఉంటున్నా రు. ఈ తరుణంలో మహిళా వర్సిటీ ఏర్పాటు వారికి మరింత ప్రోత్సాహకరంగా నిలుస్తుంది.  
– ప్రొఫెసర్‌ రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ   

మరిన్ని వార్తలు