అలాంటి వాళ్ల వల్ల మహాత్ముడి ఔన్నత్యం ఏమాత్రం తగ్గదు: సీఎం కేసీఆర్‌

2 Oct, 2022 11:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ జయంతిని (అక్టోబర్‌ 2) పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌ మహత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన 16 ఫీట్ల గాంధీజీ విగ్రాహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అంతకుముందు గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌ ఎంజీరోడ్‌లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

విగ్రహావిష్కరణ అనంతరం.. ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రి వైద్యులు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. గాంధీ వైద్యులు కరోనాపై యుద్ధం చేశారన్నారు. మంచి జరిగితే తప్పక ప్రశంసలు వస్తాయన్నారు. ‘మహాత్ముడి సిద్ధాంతం విశ్వజనీనం. మహాత్ముడు జన్మించిన దేశంలో మనం పుట్టడం ఎంతో పుణ్యం. ఆనాడు యావత్తు భారతాన్ని నడిపించిన సేనాని మహాత్మా గాంధీ. గాంధీ ఏ కార్యక్రమం చేసినా అద్భుతమే, గొప్ప సందేశమే. గాంధీ ప్రతి మాట, పలుకు ఆచరణాత్మకం.

పట్టణ, పల్లె ప్రగతికి ప్రేరణ గాంధీయే. గాంధీ మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నాం. ఈ మధ్య వేదాంత ధోరణిలో నా మాటలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. ప్రపంచంలో శాంతి ఉంటేనే మనమంతా సుఖంగా ఉంటాం. ఎన్ని ఆస్తులు ఉన్నా శాంతి లేకపోతే, జీవితం ఆటవికమే. ఈ మధ్య మహాత్ముడినే కించపరిచే మాటలు మనం వింటున్నాం. ఆయనను కించపరిచే మాటలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. అలాంటి వాళ్ల వల్ల మహాత్ముడి ఔన్నత్యం ఏమాత్రం తగ్గదు’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు