Hyderabad: భార్యను వదిలేసి స్వాతి టీచర్‌తో న్యాయవాది.. చిత్ర హింసలు.. కాదు కిడ్నాప్‌!

18 Mar, 2022 11:10 IST|Sakshi

భార్యాభర్తల పరస్పర ఫిర్యాదు

ఇరువురిపై కేసులు నమోదు

సాక్షి, చైతన్యపురి: కన్న కొడుకును చిత్రహింసలు పెట్టాడని భార్య ఫిర్యాదుతో ఓ న్యాయవాదిపై  సరూర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆర్డర్‌పై తన వద్ద ఉన్న కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లారని న్యాయవాది ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువురిపై కేసులు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ మాధవరావు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్స్‌ కాలనీలో నివసించే న్యాయవాది దేవులపల్లి సంతోష్‌కుమార్‌కు ఉమామహేశ్వరితో 11 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి అర్షిత్‌సాయి (10), కల్యాణ్‌సాయి (8) కుమారులు ఉన్నారు.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో వేర్వేరుగా ఉంటున్నారు. కోర్టులో కేసు నడుస్తోంది. నాలుగు నెలల క్రితం కోర్టు ఆర్డర్‌ ప్రకారం ఇద్దరు కుమారులను సంతోష్‌కుమార్‌ తన వద్దకు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా, సోమవారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఉమామహేశ్వరికి ఫోన్‌కాల్‌ వచ్చింది. తప్పిపోయిన మీ కుమారుడు తమ వద్ద ఉన్నాడని చెప్పాడు. అక్కడికి వెళ్లిన ఉమామహేశ్వరికి తన పెద్ద కుమారుడు అర్షిత్‌సాయి కనిపించాడు. ఒంటిపై గాయాలు ఉన్నాయి.

తనను తండ్రి సంతోష్‌కుమార్, ఆయనతో పాటు ఉంటున్న టీచర్‌ స్వాతి తనను చిత్రహింసలు పెట్టారని తల్లికి వివరించాడు. స్వాతి టీచర్‌ గరిటెతో పొట్టపై వాతలు పెట్టిందని, తండ్రి బెల్ట్‌తో కొట్టాడని చెప్పటంతో ఉమామహేశ్వరి సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై కోపంతో తమ కుమారుడిని చిత్రహింసలు పెట్టిన భర్త సంతోష్‌కుమార్, స్వాతిపై చర్యలు తీసుకోవాలని కోరింది.  
చదవండి: కూతురిపై కన్నేసిన తండ్రి.. కాపాడిన సవతి తల్లి

తన కుమారుడు అర్షిత్‌ సాయిని తాము చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవం కాదని.. కోర్టు అనుమతితో తీసుకొచ్చిన తన కుమారుడిని ఉమామహేశ్వరి, ఆమె సోదరుడు శివకుమార్‌ బలవంతంగా తీసుకెళ్లారని సంతోష్‌ కుమార్‌ సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువురి ఫిర్యాదు స్వీకరించి రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మాధవరావు తెలిపారు.  
చదవండి: ఎమ్మెల్యే పేరుతో ఉన్న కారు బీభత్సం.. స్పందించిన బోధన్‌ ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు