బీఆర్‌ఎస్‌ను పలుచోట్ల ఓడించే దమ్ముంది.. పొత్తు ఉండాలంటే.. సీట్లు ఇవ్వాల్సిందే

14 Feb, 2023 02:44 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ను పలుచోట్ల ఓడించే దమ్ముందని నేతల వ్యాఖ్య 

అధికార పార్టీని చెరో 5–10 సీట్లు కోరాలని యోచన 

కుదరకుంటే 2 ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీల చొప్పున కేటాయించేలా ఒప్పందానికి పట్టు! 

కోరుతున్న సీట్ల జాబితాలో భద్రాచలం, కొత్తగూడెం? 

నేడు లెఫ్ట్‌ పార్టీల కీలక సమావేశం 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండాలంటే ఆ పార్టీ తమకు గౌరవ ప్రదమైన సీట్లు కేటాయించాలని సీపీఐ, సీపీఎం స్పష్టం చేస్తున్నాయి. సీట్లు కేటాయిస్తేనే పొత్తు ఉంటుందని లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించుకోవాల్సి వస్తుందని చెబుతున్నాయి. ‘మాతో పొత్తు, సీట్ల కేటాయింపునకు సంబంధించి ఇటీవల కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సీపీఐ, సీపీఎంలకు అసెంబ్లీలో సీట్లు కేటాయించబోమని, కేవలం చెరో ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తామంటున్నారు. ఇది బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశం మేరకు చేస్తున్న వ్యాఖ్యలుగా మేము అనుకోవట్లేదు.

అయితే ఒకవేళ అలాంటి ఆలోచన బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి ఉంటే మాత్రం ఒకసారి పునరాలోచించుకోవాలి. లేకుంటే మేము ప్రత్యామ్నాయ ఆలోచన చేయాల్సి ఉంటుంది’అని లెఫ్ట్‌ పార్టీలకు చెందిన ఒక నేత వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు, ఇతరత్రా అంశాలపై సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం సహా ఆ పార్టీలకు చెందిన ఇతర రాష్ట్ర సీనియర్‌ నేతలు మంగళవారం భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది. 

గెలిచే సత్తా లేకున్నా ఓడించే దమ్ముంది... 
బీజేపీ ప్రధాన శత్రువుగా ముందుకు సాగాలన్నది సీపీఐ, సీపీఎంల ప్రధాన వైఖరి. కేంద్రంలో, రాష్ట్రంలోనూ బీజేపీకి బ్రేక్‌ వేసేందుకు అవసరమైన వ్యూహం రచించేలా ఆ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. బీజేపీని ఓడించే సత్తా ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే గతేడాది మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌కు సీపీఐ, సీపీఎంలు మద్దతిచ్చాయి. ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాయి. అయితే రానున్న ఎన్నికల్లో తమకు ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా లేకపోయినా విడిగా పోటీ చేసి బీఆర్‌ఎస్‌ను కొన్నిచోట్ల ఓడించే దమ్ము మాత్రం ఉందని ఆయా పారీ్టల నేతలు అంటున్నారు. తమను తక్కువగా అంచనా వేస్తే బీఆర్‌ఎస్‌కే నష్టమని ఓ సీనియర్‌ నేత కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. బీజేపీకి చెక్‌ పెట్టాలంటే తమకు గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. మరోవైపు ఇరు పారీ్టలు పరస్పరం అభ్యర్థులను పోటీకి నిలపొద్దని సీపీఐ, సీపీఎం ఒక నిర్ణయానికి రానున్నాయి. పరస్పర ఐక్యత, బీఆర్‌ఎస్‌తో పొత్తుపై మంగళవారం సమావేశంలో నేతలు ప్రాథమికంగా ఒక అంచనాకు రానున్నారు.  

ఎన్ని సీట్లు అడుగుదాం? 
పొత్తుల విషయంలో ఒకవేళ బీఆర్‌ఎస్‌తో చర్చించాల్సి వస్తే ఎన్ని సీట్లు అడగాలనే అంశంపైనా సీపీఐ, సీపీఎంలు ఈ సమావేశంలో ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చే అవకాశముంది. చెరో 10 సీట్లు అడగాలని, కనీసం చెరో 5 ఇచ్చేలా అయినా ఒప్పందం చేసుకోవాలన్న ఆలోచనగా ఉంది. ఒకవేళ అదీ సాధ్యం కాకుంటే చివరకు చెరో రెండు అసెంబ్లీ స్థానాలు కోరడంతోపాటు ఇరు పారీ్టలు ఒకట్రెండు ఎమ్మెల్సీ సీట్ల చొప్పున అయినా సాధించాలని నేతలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సీపీఐ కొత్తగూడెం స్థానాన్ని, సీపీఎం భద్రాచలం సీటును తప్పనిసరిగా అడిగే అవకాశమున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌కు ఇబ్బంది లేకుండా, తమ పారీ్టలు బలంగా ఉన్న నియోజకవర్గాలను సీపీఐ, సీపీఎంలు గుర్తిస్తున్నాయి.

మరిన్ని వార్తలు