Aasara Pensions-Hyderabad: హైదరాబాద్‌లో భారీగా కొత్త ఆసరా పింఛన్లు.. ఎంత మందికి అంటే?

15 Aug, 2022 19:09 IST|Sakshi

65 వయసుపై బడిన వారి దరఖాస్తులకు మోక్షం

రెండో విడతలో వయసు సడలింపు దరఖాస్తులు  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో  కొత్తగా లక్షన్నర మందికి ఆసరా పింఛన్ల లబ్ధి చేకూరనుంది. పాత పెండింగ్‌ దరఖాస్తులకు మోక్షం లభించింది. ఇప్పటికే తుది జాబితా సిద్ధంగా ఉండటంతో  కొత్త పింఛన్ల మంజూరుకు మార్గం సుగమమైంది. పంద్రాగస్టు తర్వాత  కొత్త పింఛన్లు అందనున్నాయి. వాస్తవంగా గత మూడేళ్లుగా ఆసరా కొత్త పింఛన్ల ఊసే లేకుండా పోయింది. ఆసరా పింఛన్ల  దరఖాస్తుల స్వీకరణ నిరంతర  ప్రక్రియగా కొనసాగుతూ వచ్చింది.

దరఖాస్తులపై  ఎప్పటికప్పుడు  క్షేత్ర స్థాయి విచారణ పూర్తయి అర్హులను గుర్తించినా... . మంజూరు  మాత్రం పెండింగ్‌లో పడిపోతూ వచ్చింది. ప్రభుత్వం నంచి గ్రీన్‌ సిగ్నల్‌ లేకపోవడంతో కొత్త పింఛన్లకు మోక్షం లభించలేదు. తాజాగా ముఖ్యమంత్రి ప్రకటనతో ఆసరా పెండింగ్‌ ప్రతిపాధనలకు  కదలిక వచ్చినట్లయింది. దీంతో వితంతు,వికలాంగుల, ఒంటరి మహిళాలతోపాటు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు పింఛన్లు మంజూరు కానున్నాయి. ఇప్పటికే సెర్ప్‌ వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వ ఆదేశాలతో  వాటికి మోక్షం లభించినట్లయింది.  
(చదవండి: 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. రోడ్డుకు నోచుకోని తండాలు)

మరో లక్షన్నర సడలింపు దరఖాస్తులు 
వయస్సు సడలింపు దరఖాస్తులు సుమారు లక్షన్నర పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా  ఏడాది క్రితం వయస్సు సడలింపుతో అర్హులైన  వారి నుంచి మీ సేవా ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టులో పక్షం రోజులు, ఆ తర్వాత సెప్టెంబర్‌లో పక్షం రోజులు దరఖాస్తులు స్వీకరించారు. బోగస్‌ దరఖాస్తులకు రాకుండా  బయోమెట్రిక్‌ తప్పనిసరి చేయడంతో దరఖాస్తుదారులు వ్యక్తిగతంగా మీ సేవా కేంద్రాలకు వెళ్లి  పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. కాగా, వాటిపై ఇప్పటి వరకు సరైన ఆదేశాలు లేక కనీసం క్షేత్ర స్థాయి విచారణ లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం  పెండింగ్‌లో పడిపోయాయి.
(చదవండి: కేంద్రం ఇచ్చింది 3శాతం కంటే తక్కువే..)

మరిన్ని వార్తలు