కాంతులీనిన కళా కౌముది.. ముగిసిన హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌

30 Jan, 2023 15:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాహిత్యం, చిత్రలేఖనం తదితర కళలకు వేదికగా నిర్వహించిన 13వ హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ ఆదివారం ముగిసింది. కరోనా నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత సైఫాబాద్‌ లోని విద్యారణ్య పాఠశాలలో జరిగిన ఈ వేడుక 3 రోజుల పాటు నగర వాసులను అలరించింది.  

ఆద్యంతం.. వైవిధ్యం.. 
చివరి రోజైన ఆదివారం తొలి ప్యానెల్‌ చర్చలో భారతీయ ఒంటరి యువతి.. దగ్గర తనం కోసం అన్వేషణ, స్వేచ్ఛ అనే అంశంపై వరల్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగినిగా సేవలు అందిస్తున్న శ్రేయణ, సి.రామమోహన్‌రెడ్డిల మధ్య డెస్పరేట్లీ సీకింగ్‌ ఫర్‌ షారూఖ్‌ రచనపై జరిగిన సంభాషణ అర్థవంతంగా సాగింది. హైదరాబాద్‌ బుక్‌ 2 ఆఫ్‌ ది పార్టిషన్‌పై రచయిత్రి మన్రీత్‌ సోథీ, ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్‌ సోమేశ్వర్‌ సాతి, ఎ.సునీతలు చర్చ చరిత్రలోకి తొంగిచూసింది.  
     
అదే విధంగా పలు అంశాలపై ప్యానెల్‌ చర్చలు ఆసక్తికరంగా సాగాయి. కావ్యధారలో భాగంగా సరోజిని నాయుడు కవిత నుంచి స్ఫూర్తి పొందిన బర్డ్‌ ఆఫ్‌ టైమ్‌ను నగరానికి చెందిన కాలేజ్‌ ప్రొఫెసర్, నృత్య కళాకారిణి మైథిలి ప్రదర్శించారు, హమ్‌ ఐసీ బోల్లీ పేరిట హైదరాబాద్‌కి చెందిన పలువురు కవుల సమూహం అందించిన కవితలు స్థానికతకు పట్టం కట్టాయి. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వర్క్‌షాప్‌లో పర్యావరణ వేత్త నల్లపురాజు చెప్పిన విషయాలు ఆలోచన రేకెత్తించాయి.  
     
భారతీయ సైన్‌ లాంగ్వేజ్‌పై సంబంధిత నిపుణురాలు అంజుఖేమాని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. స్టోరీ టెల్లింగ్‌లో భాగంగా సైన్స్‌ స్టోరీస్‌ ఫర్‌ ఆల్‌ అంటూ రోహిణి చింత  సైన్స్‌ని కొత్తగా వినిపించారు. మూవీ ఇమేజెస్‌లో నాచో–మియా కంపోజర్‌ ప్రదర్శన...  ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.  
     
ఇండీ ఎక్స్‌ప్రెస్‌ సంగీతం వీనుల విందు చేయగా, తుది కార్యక్రమంగా నిర్వహించిన మనాల్‌ పాటిల్, రవి గైక్వాడ్‌ల స్టాండప్‌ కామెడీ ఆహూతులకు నవ్వుల్ని పంచింది. నృత్యం, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం.. ఇలా విభిన్న అంశాల మేలు కయికగా సాగిన ఫెస్ట్‌ని ఆహూతులు, కళాభిమానులు బాగా ఆస్వాదించారు. రెండేళ్ల విరామం తర్వాత కూడా హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ తనదైన పునరాగమనాన్ని ఘనంగా చాటింది.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు